Telangana: డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ..!
తెలంగాణ ఇచ్చిన పార్టీ అయినప్పటికీ.. పదేళ్ల విరామం తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తి అవుతున్న సందర్భంగా డిసెంబర్ 9న సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కార్యక్రమానికి సోనియా గాంధీ, రాహుల్ గాంధి, ప్రియాంక గాంధీని ఆహ్వానించాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ సీనియర్ నేతలు, కార్యకర్తలు అదే అభిప్రాయంతో ఉన్నట్లు సమాచారం.
గత సంవత్సరం డిసెంబర్ 7న ఎల్బీస్టేడియంలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి సోనియా, రాహుల్, ప్రియాంక హాజరయ్యారు. ఇప్పుడు కూడా వారినే ఆహ్వానించాలని భావిస్తున్నారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని సచివాలయం ముందు ఏర్పాటు చేస్తున్నారు. విగ్రహావిష్కరణను ఘనంగా నిర్వహించాలని సీఎం నిర్ణయించారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని సోనియా గాంధీ చేతుల మీదుగా ఆవిష్కరించాలని భావిస్తున్నారు. ఆ తర్వాత సభ నిర్వహించే అవకాశం ఉంది.

అలాగే ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో స్క్రీన్లు కూడా ఏర్పాటు చేయనున్నారు. సోనియా గాంధీ అనారోగ్యం కారణంగా ఇక్కడి వస్తారో లేదో ఇంకా క్లారిటీ రాలేదు. సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీలను ఆహ్వానించడానికి సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లే అవకాశం ఉంది. శనివారం సీఎం రేవంత్ రెడ్డి సచివాలయం వద్ద జరుగుతున్న తెలంగాణ తల్లి పనులను పరిశీలించారు. కూలీలతో అప్యాయంగా మాట్లాడారు. పనులు జరుగుతున్న తీరు, ఇతర వివరాలు అడిగారు. కాగా డిసెంబర్ 9కి ఒక ప్రత్యేకత ఉంది.
ఆ రోజు తెలంగాణ ప్రకటిస్తూ 2009 డిసెంబర్ 9న యూపీఏ ప్రకటన చేసింది. అది కాకుండా ఆ రోజు సోనియా గాంధీ పుట్టిన రోజు కూడా. అందుకే డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ చేయాలని నిర్ణయించారు.












Click it and Unblock the Notifications