యూపీలో జడ్పీ ఛైర్‌పర్సన్‌గా తెలంగాణ మహిళ: బీజేపీ నుంచి ఎన్నికైన శ్రీకళా రెడ్డి
లక్నో/సూర్యపేట: ఇటీవల జరిగిన ఉత్తరప్రదేశ్ జిల్లా పరిషత్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ దాదాపు క్లీన్‌స్వీప్ చేసిన విషయం తెలిసిందే. కాగా, తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఓ మహిళ ఇక్కడ ఓ జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్‌గా ఎన్నికయ్యారు.

బీజేపీ నుంచి పోటీ..
వివరాల్లోకి వెళితే.. సూర్యపేట జిల్లా నడిగూడెం మండలం రత్నవరానికి చెందిన శ్రీకళారెడ్డి ఉత్తరప్రదేశ్‌లోని జన్పూర్ జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్‌గా బీజేపీ నుంచి ఎన్నికయ్యారు. ఈమె మాజీ ఎమ్మెల్యే కీసర జితేందర్ రెడ్డి కుమార్తె. గతంలో కోదాడ నియోజకవర్గ రాజకీయాల్లో చురుకుగా పాల్గొన్న శ్రీకళారెడ్డికి యూపీకి చెందిన ధనుంజయ్‌తో వివాహం జరిగింది.

జడ్పీ ఛైర్‌పర్సన్‌గా శ్రీకళా రెడ్డి..
యూపీలోనే నివాసం ఉంటున్న ధనుంజయ్-శ్రీకళ దంపతులు బీజేపీలో చేరి రాజకీయాల్లో చురుకుగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో యూపీలో జరిగిన జిల్లా పరిషత్ ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసి జడ్పీటీసీ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత జన్పూర్ పరిషత్ ఛైర్ పర్సన్‌గా ఎన్నుకున్నారు. దీంతో రత్నవరంలో కుటుంబసభ్యులు, బంధువులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ నుంచి వెళ్లిన శ్రీకళారెడ్డి.. యూపీలో జడ్పీ ఛైర్‌పర్సన్‌గా ఎన్నికవడం సంతోషంగా ఉందని అంటున్నారు.
Recommended Video

యూపీ బీజేపీలో కొత్త ఉత్సాహం..
ఇది ఇలావుండగా, యూపీ పరిషత్ ఎన్నికల్లో బీజేపీ దాదాపు క్లీన్‌స్వీప్ చేసింది. . 75 జిల్లా పంచాయతీ చైర్‌పర్సన్ సీట్లకు గానూ ఏకంగా 60కిపైగా స్థానాల్లో విజయ దుంధుభి మోగించింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గట్టి పోటీ ఇస్తుందనుకున్న అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ చతికిల పడింది. సమాజ్‌వాదీ పార్టీ కేవలం ఆరు స్థానాలకే పరిమితమైంది. మొత్తం 75 స్థానాలకు గానూ 67 స్థానాల్లో బీజేపీకి చెందిన మద్దతుదారులు చైర్ పర్సన్లు గెలుపొందినట్లు ఉత్తరప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు స్వతంత్ర దేవ్ సింగ్ తెలిపారు. ఇదే ఊపుతో 2022 అసెంబ్లీ ఎన్నికల్లోనూ గెలుపొందడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు ఫోన్ చేసి అభినందించారు ప్రధాని నరేంద్ర మోడీ. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల ముందు ఈ విజయం యూపీ బీజేపీలో కొత్త ఉత్సహాన్ని నింపింది.












Click it and Unblock the Notifications