వీడియో: చెరువులో తేలిన మైనర్ అక్కాచెల్లెళ్ల మృతదేహాలు: తెలంగాణ మారుమూల గ్రామంలో కలకలం
నిర్మల్: తెలంగాణలోని మారుమూల గ్రామంలో దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. ముగ్గురు మైనర్ బాలికలు నిర్జీవంగా కనిపించారు. వారి మృతదేహాలు ఓ చెరువులో తేలాయి. ఆదివారం సాయంత్రం నుంచి కనిపించకుండా పోయిన ఆ ముగ్గురు బాలికలు జల సమాధి అయ్యారు. వారు క్షేమంగా ఇంటికి తిరిగి వస్తారంటూ ఆశించిన కుటుంబ సభ్యులు ఈ ఘటనతో విషాదంలో మునిగిపోయారు. మృతులు ఒకే కుటుంబానికి, ఒకే గ్రామానికి చెందిన వారు.. దాదాపు సమ వయస్కులు. హఠాత్తుగా వారు అదృశ్యం కావడం, ఆ మరుసటి రోజే నిర్జీవంగా కనిపిించడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమౌతోన్నాయి.

నిర్మల్ జిల్లాలో ఘటన..
నిర్మల్ జిల్లాలో చోటు చేసుకున్న ఉదంతం ఇది. జిల్లాలోని తానూర్ మండలం సింగన్‌గావ్‌లో ఈ తెల్లవారు జామున సంభవించింది. మహారాష్ట్ర సరిహద్దులకు ఆనుకుని ఉండే గ్రామం.. సింగన్‌గావ్. ఇక్కడ నివసిస్తోన్న వారిలో అత్యధికులు గిరిజనులు. ఈ గ్రామానికి చెందిన సునీత, వైశాలి, అంజలి అనే ముగ్గురు అక్కా చెల్లెళ్లు ఆదివారం సాయంత్రం నుంచి అదృశ్యం అయ్యారు. వారిలో సునీత, వైశాలి అక్కాచెల్లెలు కాగా.. అంజలి వారి సమీప బంధువుల కుమార్తె. ఎక్కడికి వెళ్లినా కలిసే వెళ్తుంటారు. ముగ్గురు అక్కా చెల్లెళ్ల మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది.

రోజు గడవక ముందే..
కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో పాఠశాలలు లేకపోవడం వల్ల ఆన్‌లైన్ తరగతులకు హాజరవుతున్నారు. ఆదివారం సాయంత్రం ముగ్గురూ కనిపించకుండా పోయారు. రాత్రయినా వారి ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. వారి కోసం అన్నిచోట్లా గాలించారు. వారి జాడ లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్‌గా కేసు నమోదు చేసుకున్న పోలీసులు వారి కోసం గాలిస్తోన్న సమయంలోనే ఈ తెల్లవారు జామున సునీత, వైశాలి, అంజలి మృతదేహాలు గ్రామ సమీపంలోని ఓ చెరువులో కనిపించాయి. తొలుత స్థానికులు వారి మృతదేహాలను గుర్తించారు.. పోలీసులకు సమాచారం ఇచ్చారు.

హత్య..ఆత్మహత్య..
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. వారి తల్లిదండ్రులకు ఈ విషయాన్ని తెలియజేశారు. ఆత్మీయంగా కలిసి తిరిగే ముగ్గురూ నిర్జీవంగా కనిపించడం గ్రామంలో కలకలం రేపింది. ఈ విషయం తెలిసిన వెంటనే గ్రామస్తులందరూ చెరువు వద్దకు చేరుకున్నారు. ముగ్గురు అక్కచెల్లెళ్లు కనిపించకపోవడం.. ఆ మరుసటి రోజే మృతదేహాలతో కనిపించడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమౌతోన్నాయి. ఆత్మహత్య చేసుకునేంతటి అవసరం గానీ, పరిస్థితులు గానీ వారికి లేవని గ్రామస్తులు చెబుతున్నారు.
Recommended Video

విషాదంలో కుటుంబం..
ప్రాణాలతో తిరిగి వస్తారనే ఆశతో ఉన్న వారి కుటుంబ సభ్యులు ఈ సమాచారంతో దిగ్భ్రాంతికి గురయ్యారు. చెరువు ఒడ్డున నిర్జీవంగా ఉన్న తమ కుమార్తెలను చూసి తట్టుకోలేకపోయారు. గుండెలవిసేలా రోదించారు. తమ పిల్లలకు ఎలాంటి కష్టం తెలియకుండా పెంచామని, ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు వారికి లేవని చెబుతున్నారు. ఈ ఘటనపై అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. మిస్సింగ్ కేసును.. అనుమానాస్పద స్థితిలో మృతి కేసుగా బదలాయించారు.












Click it and Unblock the Notifications