హుజూరాబాద్‌లో టెన్షన్: తడిబట్టలతో ప్రమాణం చేసిన పాడి కౌశిక్ రెడ్డి, పొన్నంకు సవాల్!!
హుజురాబాద్ నియోజకవర్గం లో మంత్రి పొన్నం ప్రభాకర్ వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మధ్య అవినీతి ఆరోపణల పర్వం కొనసాగుతోంది. ఒకరిపై ఒకరు అవినీతి ఆరోపణలు, ఆలయాలలో ప్రమాణాలు చేసే దాకా వెళ్ళింది. మంత్రి పొన్నం ప్రభాకర్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అవినీతి ఆరోపణలు చేశారు.
పొన్నం ప్రభాకర్, పాడి కౌశిక్ రెడ్డి మధ్య ఫ్లైయాష్ అవినీతి రగడ
రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఫ్లైయాష్ తరలింపులో 100 కోట్లు భారీ అవినీతికి పాల్పడ్డారని, ఓవర్ లోడ్ లారీలను కూడా వదిలిపెట్టకుండా అవినీతికి పాల్పడుతున్నట్టు కౌశిక్ రెడ్డి ఆరోపించారు. ఇక ఫ్లైయాష్ విషయంపై తనపై నిరాధారమైన ఆరోపణలు చేసిన హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కి మంత్రి పొన్నం ప్రభాకర్ నోటీసులు ఇచ్చారు.

పాడి కౌశిక్ రెడ్డికి ప్రణవ్ బాబు సవాల్
ఇక దీంతో హుజురాబాద్ రాజకీయం ప్రస్తుతం హాట్ హాట్ గా మారింది.ఇక పాడి కౌశిక్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ప్రణవ్ బాబు కౌంటర్ ఇచ్చారు. అవినీతికి కేరాఫ్ అడ్రస్ అయిన పాడి కౌశిక్ రెడ్డి పొన్నం ప్రభాకర్ గురించి మాట్లాడటంపై మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కౌశిక్ రెడ్డి రైస్ మిల్లర్ల నుండి, ఉద్యోగాల పేరుతోను డబ్బులు వసూలు చేశారని మా దగ్గర ఆధారాలు ఉన్నాయన్నారు.
సవాల్ స్వీకరించి గుడికి బయలుదేరిన [పాడి కౌశిక్ రెడ్డి
నేడు ఉదయం చెల్పూర్ హనుమాన్ టెంపుల్ వద్దకు వస్తే ఆధారాలతో నిరూపిస్తామని హుజురాబాద్ కాంగ్రెస్ ఇన్చార్జి వొడితల ప్రణవ్ సవాల్ విసిరారు. ఈ సవాల్ ని స్వీకరించిన పాడి కౌశిక్ రెడ్డి తాను ఎటువంటి అవినీతి చేయలేదని, హుజురాబాద్ ప్రజలకు నా నిజాయితీ నిరూపించుకోవడానికి హనుమాన్ టెంపుల్ వద్దకు వస్తున్నానని పేర్కొన్నారు. ఇక పాడి కౌశిక్ రెడ్డి ఉదయం 11గంటలకు హనుమాన్ టెంపుల్ వద్దకు రానున్న నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు.
తడిబట్టలతో ఇంటి వద్దనే ప్రమాణం చేసిన పాడి కౌశిక్ రెడ్డి
ఆయనను పోలీసులు హౌజ్ అరెస్టు చేశారు. మరోవైపు చెల్పూర్ హనుమాన్ ఆలయం వద్ద కూడా ఉద్రిక్త పరిస్థితి చోటుచేసుకుంది. ఇక హౌస్ అరెస్టు చేసిన పాడి కౌశిక్ రెడ్డి చెల్పూర్ హనుమాన్ ఫోటో పెట్టుకుని దేవుడు సాక్షిగా మీరు చేసిన సవాల్ కు నా నిజాయితీని నిరూపించుకునేందుకు తడి బట్టలతో ప్రమాణం చేస్తున్నానని ఇంటి వద్దనే ప్రమాణం చేశారు.
పొన్నం ప్రభాకర్ కు పాడి కౌశిక్ రెడ్డి సవాల్
నేను ఎక్కడ అవినీతి చేయలేదు.. చేసే అవసరం కూడా నాకు లేదు.. చెయ్యను కూడా అంటూ ఆయన పేర్కొన్నారు. ఇదే సమయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ కు సవాల్ చేస్తున్నానని పేర్కొన్న ఆయన రేపు 12 గంటలకు నువ్వు అపోలో వెంకటేశ్వర స్వామి గుడికి వచ్చి నా సవాల్ ని స్వీకరించి నీ నిజాయితీ నిరూపించుకో అంటూ తెలిపారు. ఒకవేళ నువ్వు రాకపోతే అన్ని స్కామ్లు చేసినట్టేనని, అక్రమంగా నువ్వు వేల కోట్ల రూపాయలను దోచుకున్నావని ఒప్పుకున్నట్టేనని పాడి కౌశిక్ రెడ్డి పొన్నం ప్రభాకర్ కు సవాల్ విసిరారు.












Click it and Unblock the Notifications