తెలంగాణలో సగం మెడికల్ షాప్స్ లో నో ఫార్మసిస్ట్స్.. టీజీ సేఫ్ నోటీసులు జారీ!
తెలంగాణాలో మెడికల్ దుకాణాల నిర్వహణలో తీవ్ర లోపాలు వెలుగులోకి వచ్చాయి. రాష్ట్రంలో సుమారు 40 వేల మెడికల్ దుకాణాలు ఉన్నాయి. వీటిలో సగానికి పైగా దుకాణాలు అర్హత కలిగిన ఫార్మసిస్టులు లేకుండానే నడుస్తున్నట్లు తెలంగాణ స్టాండర్డ్స్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ ఎసెన్షియల్ డ్రగ్స్ (టీజీ సేఫ్) అధికారులు గుర్తించారు. కొన్ని నెలలుగా చేపట్టిన తనిఖీల్లో 20 వేలకు పైగా దుకాణాల్లో సాధారణ వ్యక్తులే మందులు అమ్ముతున్నారని తేలింది.
వైద్యులు రాసిన చీటీ ప్రకారం మందులు ఇవ్వాలి. ఎంజీ, ఫార్ములేషన్‌లో తేడా వస్తే రోగి ప్రాణాలకే ప్రమాదం. కానీ చాలా దుకాణాల్లో ఫార్మసిస్టు సర్టిఫికేట్‌తో లైసెన్స్ తీసుకుని, కౌంటర్లో మాత్రం అనర్హులను ఉంచుతున్నారు. వైద్యుడి చీటీ లేకుండానే షెడ్యూల్ హెచ్1 మందులు, అలవాటు చేసే ఔషధాలు హాబిట్ ఫార్మింగ్ డ్రగ్స్ యథేచ్ఛగా అమ్ముతున్నారు. టీజీ సేఫ్ కమిషనర్ అవినాశ్ మహంతి మాట్లాడుతూ.. ఫార్మసిస్టు ఉన్నప్పుడే మందులు అమ్మాలని, సహాయకులు ఉన్నా ఫార్మసిస్టు పరిశీలించాకే అనుమతి ఇవ్వాలని రాష్ట్రవ్యాప్తంగా నోటీసులు జారీ చేశామని చెప్పారు.

200కు పైగా దుకాణాల లైసెన్సులు తాత్కాలికంగా సస్పెండ్ చేశారు. 14 రోజుల్లోగా లోపాలు సరిదిద్దుకొని జవాబు ఇవ్వాలని హెచ్చరించారు.రాష్ట్రంలో ఫార్మసీ కౌన్సిల్లో 90 వేల మంది నమోదై ఉన్నారు. అయినా మెడికల్ దుకాణాల్లో పనిచేయాలంటే ఎక్కువ వేతనం చెల్లించాల్సి వస్తుంది. అందుకే కొందరు దుకాణదారులు ఇంటర్, డిగ్రీ చదివిన వారిని తక్కువ జీతానికి నియమించుకుంటున్నారని అధికారులు చెబుతున్నారు.
ఇటీవల టీజీ సేఫ్ ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా అలవాటు చేసే మందుల అక్రమ విక్రయాలపై కూడా కొరడా ఝుళిపించింది. 255 దుకాణాల లైసెన్సులు సస్పెండ్ చేశారు. ఆన్లైన్ ఫార్మసీలకు అనుబంధంగా ఉన్న దుకాణాలపై కూడా తనిఖీలు జరిగి 32 దుకాణాలకు నోటీసులు ఇచ్చారు. ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు అమ్మడం, రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ లేకుండా విక్రయం, రికార్డులు సరిగా నిర్వహించకపోవడం వంటి లోపాలు గుర్తించారు.
ప్రజల ఆరోగ్య భద్రత కోసం ఫార్మసిస్టు తప్పనిసరి అని అధికారులు స్పష్టం చేశారు. ఫిర్యాదులు చేయాలనుకునేవారు టీజీ సేఫ్ టోల్ ఫ్రీ నంబర్ 1800-599-6969కు సంప్రదించవచ్చు. లోపాలు సరిదిద్దుకోని దుకాణాలపై మరిన్ని కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.













Click it and Unblock the Notifications
