భాగ్యనగరి రోడ్లపై సరికొత్త సిటీ బస్సులు..!!
TGSRTC: హైదరాబాద్, సికింద్రాబాద్ రోడ్లపై కొత్తగా మరిన్ని ఎలక్ట్రిక్ సిటీ బస్సులు పరుగులు పెట్టబోతున్నాయి. పర్యావరణ హిత ఎలక్ట్రిక్ బస్సులను టీఎస్ఆర్టీసీ అధికారులు అందుబాటులోకి తీసుకుని రానున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో దశలవారీగా మొత్తం 1,500 ఎలక్ట్రిక్ బస్సులను వినియోగంలోకి తీసుకుని రావడానికి అధికారులు చర్యలు తీసుకుంటోన్నారు.
కాలుష్యాన్ని నివారించడం, ప్రయాణికులకు మరింత మెరుగైన ప్రయాణ వసతిని కల్పించడంలో భాగంగా ఎలక్ట్రిక్ బస్సులను నడిపించనున్నారు. ఇప్పటివరకు 204 ఎలక్ట్రిక్ ఏసీ/నాన్ ఏసీ బస్సులను వివిధ మార్గాల్లో ప్రవేశపెట్టారు. కొత్త ప్రోటో ఎలక్ట్రిక్ బస్సులు అవి.

హైదరాబాద్‌లో అన్నీ ఎలక్ట్రిక్ బస్సులే నడిపేలా భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకుంది టీజీఎస్ఆర్టీసీ. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి 500 బస్సులను అందుబాటులోకి తీసుకుని రావాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా సిటీలో ఇప్పటికే 204 ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది.
వాటిల్లో 50 వరకు ఏసీ బస్సులు ఉన్నాయి. మిగిలినవి ఆర్డినరీ, మెట్రో ఎక్స్ ప్రెస్‌లుగా అందుబాటులోకి తెచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరం చివరిదైన నాలుగో త్రైమాసికంలో మరో 353 బస్సులను వివిధ మార్గాల్లో నడిపించాలని నిర్ణయించింది టీజీఎస్ఆర్టీసీ. వీటితో పాటు మరో 446 అంతర్రాష్ట్ర బస్సులు కూడా తీసుకుని రానుంది.
ఈ బస్సు పొడవు 12 మీటర్లు. 35 సీట్ల సామర్థ్యం గల ఈ బస్సులో మొబైల్ ఛార్జింగ్, సీటు బెల్ట్ సదుపాయం ఉంటుంది. ప్రతి బస్సులోనూ మూడు సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వాటికి ఒక నెల రికార్డింగ్ బ్యాకప్ ఉంటుంది. బస్సు రివర్స్ చేసేందుకు వీలుగా రివర్స్ పార్కింగ్ అసిస్టెన్స్ కెమెరా కూడా ఉంటుంది. గమ్యస్థానాల వివరాలు కోసం బస్సులో నాలుగు ఎల్ఈడీ బోర్డులను ఏర్పాటు చేశారు.
అగ్నిప్రమాదాలను ముందుగానే గుర్తించి నివారించేలా బస్సుల్లో ఫైర్ డిటెక్షన్ సప్రెషన్ వ్యవస్థను ఇందులో ఉంటుంది. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 225 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణిస్తుంది ఈ బస్సు. ఫుల్ ఛార్జింగ్‌కు 2 నుంచి 3 గంటలకు సమయం పడుతుంది. ప్రయాణికుల భద్రత దృష్ట్యా వెహికిల్ ట్రాకింగ్ సిస్టంతో పాటు ప్రతి సీటు వద్ద పానిక్ బటన్ సదుపాయం కల్పించారు.












Click it and Unblock the Notifications