కార్తీకమాసంలో శుభవార్త చెప్పిన TGSRTC
పవిత్ర కార్తీకమాసం ఆరంభం కావడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో శైవక్షేత్రాలకు భక్తుల తాకిడి అధికంగా ఉంటోంది. శ్రీశైలం, శ్రీకాళహస్తి, వేములవాడ, కీసర.. వంటి ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ప్రతి సోమవారంతో పాటు ఇతర రోజుల్లోనూ శైవక్షేత్రాలను సందర్శించడానికి భక్తులు ప్రాధాన్యత ఇస్తారు. దీపారాధనలతో విరాజిల్లుతుంటాయి. ఈ నెల పొడవునా ఒకరకమైన ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిస్తుంటుంది.
ఈ మాసంలో మహిళా ప్రయాణికుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నందున పుణ్యక్షేత్రాలకు ఏపీఎస్ఆర్టీసీ, టీజీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను కూడా అందుబాటులోకి తీసుకుని వస్తోన్నాయి. ఆలయ పర్యాటకానికి ప్రాధాన్యత ఇస్తోన్నందున అన్ని ప్రధాన ఆలయాలకు ప్రత్యేక ప్యాకేజీలు ఇప్పటికే అమలులో ఉన్నాయి. తాజాగా కార్తీక మాసాన్ని పురస్కరించుకొని శ్రీశైలం, శ్రీకాళహస్తి వంటి ప్రఖ్యాత శైవక్షేత్రాలకు బస్ సర్వీసులను పెంచడంతో పాటు ప్రత్యేక ప్యాకేజీ టూర్లను కూడా ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చాయి.

ఈ దిశగా ఏపీఎస్ఆర్టీసీ ఇప్పటికే చర్యలు తీసుకుంది. కార్తీకమాసం ముగిసేంత వరకు ప్రతి శని, ఆదివారాల్లో పంచారామ క్షేత్రాలకు ప్రత్యేక బస్సులను నడిపిస్తోంది. ఈ నెల 25వ తేదీ నుంచి నవంబర్ 16వ తేదీ వరకు రాష్ట్రంలోని వివిధ పట్టణాల, జిల్లా కేంద్రాల నుంచి పంచారామాలకు బస్సులు నడుస్తాయి. ఈ నెల 25, 26, నవంబరు 1, 2, 8, 9, 15, 16 తేదీల్లో పంచారామ క్షేత్రాలకు ఏపీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపనుంది.
ఇప్పుడు తాజాగా టీజీఎస్ఆర్టీసీ కూడా పంచారామ క్షేత్రాలకు ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తీసుకుని వచ్చింది. అమరేశ్వరాయలం- అమరావతి, సోమేశ్వరాలయం- భీమవరం, క్షీర రామలింగేశ్వర ఆలయం- పాలకొల్లు, భీమేశ్వరాలయం- ద్రాక్షారామం, కుమార రామ భీమేశ్వరాలయం- సామర్లకోటకు తెలంగాణలోని అన్ని డిపోల నుంచి కూడా ఈ ప్రత్యేక బస్సులను నడిపిస్తామని టీజీఎస్ఆర్టీసీ తెలిపింది.












Click it and Unblock the Notifications