బెదిరిస్తోన్న బంగాళాఖాతం.. రైతన్నలు ఈ జిల్లాలలో వర్షాలు.. జాగ్రత్త!
తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే అనేక ప్రాంతాలలో వర్షాలు కురుస్తున్నాయి. ఆరుగాలం శ్రమించి పంటలు పండించిన అన్నదాతలు అకాల వర్షం తోటి ఇబ్బందులు పడుతున్నారు. మొక్కజొన్న, పత్తి, వరి సాగు చేస్తున్న రైతులు వర్షాల కారణంగా తీవ్ర ఇబ్బందులను పడుతున్నారు. ఇదిలా ఉంటే మళ్లీ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడబోతోందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
రాబోయే మూడు నాలుగు రోజులపాటు రాష్ట్రమంతా జోరుగా వర్షాలు
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాలలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాబోయే మూడు నాలుగు రోజులపాటు రాష్ట్రమంతా జోరుగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికల మేరకు తెలంగాణ రాష్ట్రంలో పలు జిల్లాలలో వర్షాలు పడతాయని పేర్కొంది.

ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణాపై వర్షాల ప్రభావం
ప్రస్తుతం దక్షిణ అండమాన్ సముద్రాన్ని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం సగటు సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. దీని ప్రభావంతో మంగళవారం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, ఈ పరిణామాలు తెలంగాణ పైన తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయని పేర్కొంది.
నేడు తెలంగాణలో ఈ జిల్లాలలో వర్షాలు
ఫలితంగా నేడు తెలంగాణ రాష్ట్రంలోని జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్ ,మేడ్చల్, మల్కాజ్గిరి, భూపాలపల్లి, ములుగు, కరీంనగర్, పెద్దపల్లి, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, వికారాబాద్, సంగారెడ్డి, నారాయణపేట, నాగర్ కర్నూల్, వనపర్తి, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాలలో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణకేంద్రం తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ఇప్పటికే ఈ జిల్లాలలో వర్షాలు
ఇదిలా ఉంటే గడిచిన 24 గంటల్లో హనుమకొండ, వరంగల్, ఖమ్మం, కొత్తగూడెం తదితర ప్రాంతాలలో మోస్తారు వర్షాలు నమోదైనట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుత అల్పపీడనం బలపడే కొద్ది వర్షాల తీవ్రత పెరుగుతుందని వర్షం కురిసే సమయంలో ఇళ్లకే పరిమితం కావాలని, అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని సూచనలు చేస్తుంది వాతావరణ శాఖ.












Click it and Unblock the Notifications