రైతు శ్రేయస్సుకు కేంద్రం కట్టుబడి ఉంది.!నివేదికలు ఇవ్వడంలో టీ సర్కార్ విఫలమన్న కిషన్ రెడ్డి.!
ఢిల్లీ/హైదరాబాద్ : 2021-22 రబీ పంట కాలానికి సంబంధించి 15 లక్షల మెట్రిక్ టన్నుల పార్ బాయిల్డ్ రైస్ ను తెలంగాణ రైతుల నుండి సేకరించేలా అనుమతులు మంజూరు చేయాలని కోరుతూ గత నెలలో వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి పీయూష్ గోయల్ కి తాను లేఖ వ్రాయడం జరిగిందని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖల మంత్రి, జి. కిషన్ రెడ్డి తెలిపారు.
బియ్యం కొనుగోలు అంశంలో కేంద్రమంత్రికి కిషన్ రెడ్డి లేఖ : ఈ లేఖకు పీయూష్ గోయల్ స్పందిస్తూ 2021-22 (రబీ)/2022-23 (ఖరీఫ్) పంట కాలాలకు సంబంధించి మొత్తం 13.73 లక్షల మెట్రిక్ టన్నుల పార్ బాయిల్డ్ రైస్ సేకరణకు, లక్ష్యానికి తగినట్లుగా మిగిలిన బియ్యాన్ని రా రైస్ రూపంలో నిర్ధేశించిన గడువులోపు ఎఫ్సీఐ కు అందజేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతి ఇస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు కిషన్ రెడ్డి.

కిషన్ రెడ్డి లేఖకు స్పందించిన కేంద్రమంత్రి : అంతేకాకుండా తెలంగాణ రైతులను దృష్టిలో ఉంచుకొని 2021-22 రబీ పంట కాలానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం, ఎఫ్సీఐకు బియ్యాన్ని అందించటానికి ఉన్న గడువును ఇప్పటికే పలుమార్లు పెంచినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం బియ్యాన్ని పూర్తిస్థాయిలో ఎఫ్సీఐ కు అందించని కారణంగా, చివరగా మరో అవకాశం ఇవ్వమని తాను చేసిన విజ్ఞప్తి మేరకు గడువును 31 మే, 2023 వరకూ పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం శుభసూచకమన్నారు కిషన్ రెడ్డి.
ఈ నెల చివరి వరకూ అవకాశం : దీంతో పాటు కనీస మద్దతు ధరను చెల్లించి తెలంగాణ రాష్ట్రం నుండి కేంద్ర ప్రభుత్వం అత్యధిక మొత్తంలో బియ్యాన్ని సేకరిస్తోందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. పెరుగుతున్న సేకరణకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం మిల్లింగ్ సామర్థ్యాన్ని పెంచుకోవాలని పదే పదే తెలియజేస్తున్నప్పటికీ ఆ విధంగా చర్యలు చేపట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమవుతూ వస్తోందన్నారు కేంద్ర మంత్రి. కేంద్ర ప్రభుత్వం అనేక సార్లు గడువు పెంచినా, గత సంవత్సరం రబీ పంట కాలానికి సంబంధించిన బియ్యాన్ని ఈ సంవత్సరం రబీ పంటకాలం పూర్తయినా అందించలేకపోవడం దీనికి నిదర్శనమన్నారు.

మిల్లర్ల ఆగడాలు పెరిగిపోతున్నాయి : వీటికితోడు అక్కడక్కడ కొంతమంది మిల్లర్లు అడ్డదారిన సప్లై చేస్తున్న రీసైకిల్డ్ బియ్యాన్ని అరికట్టడంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం విఫలమవుతూ వస్తోందని కిషన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేసారు. కనీసం ఇకనైనా రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని, సమయానికి ధాన్యాన్ని సేకరించి, పెరుగుతున్న సేకరణకు అనుగుణంగా మిల్లింగ్ సామర్థ్యాన్ని పెంచుకొని, రీసైకిల్డ్ బియ్యం సరఫరాను అరికట్టి, ఒప్పందం మేరకు ఎఫ్సీఐకి సకాలంలో బియ్యాన్ని అందించడంలో ఒక నిర్ధిష్ట ప్రణాళికను రూపొందించుకొని రైతుల శ్రేయస్సుకు కృషి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కోరారు.












Click it and Unblock the Notifications