కొండగట్టు అంజన్నపై పవన్ కళ్యాణ్ కు ఎనలేని భక్తి వెనుక కారణమిదే!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకుంటున్నారు. ఈ మేరకు పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట్ర పర్యటన నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. దారి పొడవున అభిమానులు ఆయనకు సాదర స్వాగతం పలుకుతూ పవన్ కళ్యాణ్ ను స్వాగతించారు. ప్రస్తుతం వారాహి దీక్షలో ఉన్న పవన్ కళ్యాణ్ కాషాయ వస్త్రాలతోనే కొండగట్టు అంజన్నను దర్శనం చేసుకునేందుకు వెళ్లారు.
కొండగట్టుకు పవన్ కళ్యాణ్
హైదరాబాద్ శివారులోని తుర్కపల్లిలో పవన్ కళ్యాణ్ ను చూసేందుకు భారీగా అభిమానులు తరలివచ్చారు. ఆపై సిద్దిపేట జిల్లా ములుగు మండలం ఒంటిమామిడి వద్ద జనసేన అధినేతకు అభిమానుల నుంచి ఘనస్వాగతం లభించింది. అక్కడ పవన్ కళ్యాణ్ ని అభిమానులు గజమాలతో సత్కరించారు. అభిమానులు అందించిన వీరఖడ్గంతో పవన్ కళ్యాణ్ ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. అనంతరం అభిమానులకు అభివాదం చేసిన పవన్ కళ్యాణ్ కొండగట్టు చేరుకుని అంజన్నకు ప్రత్యేక పూజలు చేస్తున్నారు.

మెగా ఫ్యామిలీకి ఆంజనేయ స్వామిపై భక్తి
ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ ఎందుకు కొండగట్టు ఆంజనేయ స్వామిని అంతగా విశ్వసిస్తారు. ఆయనకు కొండగట్టు అంజన్న అంటే ఎందుకంత గురి అన్నది ఆసక్తికరమైన విషయం. కొండగట్టు ఆంజనేయ స్వామికి వరాలిచ్చే దేవుడని ప్రతీతి, అందుకే పవన్ కొండగట్టు అంజన్నను బలంగా నమ్ముతారు. ఆంజనేయుడు అంటే అందరికీ శక్తినిచ్చేవాడని పవన్ కళ్యాణ్ కు అభిప్రాయం. పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు మెగా ఫ్యామిలీకి ఆంజనేయ స్వామి అంటే చాలా భక్తి.
కొండగట్టు స్థల పురాణం
ఇక కొండగట్టు స్థల పురాణం చాలా మహిమాన్వితం. దీని విషయానికి వస్తే సుమారు 300 సంవత్సరాల క్రితం కొడిమ్యాలలో సింగం సంజీవుడు అని ఒక యాదవుడు ఆవులను మేపుకుంటూ ఈ కొండ ప్రాంతానికి వచ్చి ఆవులు వందలోని ఒక ఆవు తప్పిపోవడంతో ఈ ప్రాంతమంతా వెతకడం ప్రారంభించాడు. ఆవు కోసం వెతికి, వెతికి అలసిపోయిన సంజీవుడు ఓ చెట్టు కింద కాసేపు సేద తీరాడు.

కోరింద పొదలో కొండగట్టు అంజన్న
అప్పుడు కలలో స్వామివారు కనిపించి నేను ఇక్కడే కోరింద పొదలో ఉన్నాను. నాకు ఎండ, వాన, ముళ్ళ నుండి రక్షణ కల్పించాలని సంజీవుడికి చెప్పాడు. దీంతో సంజీవుడు కోరిందపొదను తొలగించగా అందులో శంఖు చక్ర గదా అలంకరణతో ఆంజనేయస్వామి పంచముఖాలలో ఒకటైన నరసింహ ముఖంతో కనిపించాడు. అప్పుడు సంజీవుడు ఆంజనేయ స్వామికి చిన్న ఆలయాన్ని నిర్మించి పూజలు చేయడం ప్రారంభించాడు.
పవన్ కళ్యాణ్ కు కొండగట్టు అంజన్న అంటే గురి
అప్పటినుంచి ఇప్పటివరకు మహా మహిమాన్వితమైన దివ్య క్షేత్రంగా ఎవరు ఏ కోరిక కోరినా తీర్చే దేవుడిగా కొండగట్టు అంజన్న మారాడు. ఇక పవన్ కళ్యాణ్ కూడా ఏ పని చేసినా కొండగట్టు అంజన్నకు పూజలు చేసిన తర్వాతనే ప్రారంభించడం అలవాటు. గతంలో వారాహి వాహనాన్ని ప్రచారానికి తీసుకువెళ్లాలి అని భావించినప్పుడు మొదటి కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయానికి వచ్చి పూజలు నిర్వహించిన తర్వాతనే వెళ్లారు. ఇప్పుడు డిప్యూటీ సీఎంగా కొండగట్టుకు వచ్చారు. ఇలా కొండగట్టు అంజన్న పవన్ కళ్యాణ్ కు ఒక సెంటిమెంట్ గా మారారు.












Click it and Unblock the Notifications