కవిత కస్టోడియల్ రిమాండ్ కోరిన సీబీఐ: కోర్టులో వాదనలు
Kalvakuntla Kavitha: దేశవ్యాప్తంగా ప్రకంపనలు పుట్టించిన ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన భారత్ రాష్ట్ర సమితి శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత కష్టాలు మరింత పెరిగాయి. ఇప్పటికే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఆమెను అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఆమె జ్యుడీషియల్ కస్టడీలో కొనసాగనున్నారు. తీహార్ జైలులో ఉంటూ ఈడీ విచారణను ఎదుర్కొంటోన్నారు.
ఇదే కేసులో సీబీఐ అధికారులు కూడా కవితను అరెస్ట్ చేశారు. ఢిల్లీ మద్యం కుంభకోణం పాలసీలో కొన్ని గంటల పాటు విచారించిన అనంతరం కవితను అదుపులోకి తీసుకున్నారు. తీహార్ జైలులోనే ఈ విచారణ కొనసాగింది. అక్కడే ఆమెను అరెస్ట్ చేశారు సీబీఐ అధికారులు.

కవితను విచారించడానికి అనుమతి ఇవ్వాలంటూ కొద్దిరోజుల కిందటే సీబీఐ అధికారులు దాఖలు చేసుకున్న పిటీషన్‌పై సానుకూలంగా స్పందించింది ఢిల్లీ రోస్ అవెన్యూ న్యాయస్థానం. విచారణకు అనుమతి ఇచ్చింది. ఢిల్లీ మద్యం పాలసీలో సీబీఐ అధికారులు అడిగిన పలు ప్రశ్నలకు కవిత నుంచి సరైన, సంతృప్తికర సమాధానం లభించకపోవడం వల్లే అరెస్ట్ చేశారని తెలుస్తోంది.
ఈ ఉదయం ఆమెను ఢిల్లీ రోస్ అవెన్యూ న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టారు సీబీఐ అధికారులు. కవితను అయిదు రోజుల పాటు తమ కస్టోడియల్ రిమాండ్‌కు తరలించేలా ఆదేశాలను జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేయాల్సి ఉందని అన్నారు.
కవిత తరఫున సీనియర్ అడ్వొకేట్ మోహిత్ రావు తన వాదనలను వినిపించారు. కవిత అరెస్టు పూర్తిగా చట్టవిరుద్ధమైనదని పేర్కొన్నారు. ఇప్పటివరకు ఆమె దాఖలు చేసుకున్న రెండు దరఖాస్తులపై ఎలాంటి తీర్పు కూడా వెలువడలేదని అన్నారు. కవితను అరెస్టు చేయడానికి కోర్టు నుంచి స్పష్టమైన అనుమతి సైతం తీసుకోలేదని అన్నారు. ఈ క్రమంలో సీబీఐ.. కవితను అరెస్ట్ చేయడం సరికాదని స్పష్టం చేశారు.
అనంతరం వాదనలను ఈ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేసింది రోస్ అవెన్యూ న్యాయస్థానం. భోజన విరామం అనంతరం మళ్లీ వాదనలను కొనసాగనున్నాయి. సీబీఐ తనను అరెస్ట్ చేసినట్లు తీహార్ జైలు అధికారులు తనకు తెలియజేశారని, ఈ విషయాన్ని భర్తకు తెలియజేశానని కవిత అన్నారు. న్యాయపరమైన సంప్రదింపులకు ఎలాంటి అవకాశం లభించలేదని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications