Weather Report: రాష్ట్రంలో తగ్గుతోన్న ఉష్ణోగ్రతలు.. జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిక..!
తెలంగాణలో చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. ముఖ్యంగా రాత్రి పూట కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నైరుతి రుతుపవనాలు దేశం నుంచి వెళ్లిపోవడంతో చలి తీవ్ర పెరుగుతోన్నట్లు వాతావరణ శాఖ చెబుతోంది. ఈశాన్య, ఉత్తర దిశ నుంచి చలి గాలులు వీస్తున్నాయని.. వీటి ప్రభావంతో రాష్ట్రంలో చలి పెరుగుతోందని పేర్కొంది. గత వారం రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు కూడా తగ్గుతోన్నాయి.
ఉత్తర తెలంగాణ జిల్లాల్లో టెంపరేచర్లు మరింత తగ్గుతాయని వాతావరణ అధికారులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా ఉమ్మడి ఆదిరాబాద్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో చలి తీవ్రత పెరిగే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఇటు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో కూడా ఉష్ణోగ్రతలు తగ్గుతోన్నాయి. పట్నంలో అక్టోబర్ 27న సగటు కనిష్ట ఉష్ణోగ్రత 16.6 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది.

రాష్ట్రంలో గత రెండు రోజులుగా రాత్రి సమయంలో చలిగాలులు వీస్తున్నట్లు చెబుతున్నారు. శుక్రవారం రాత్రి మల్కాజిగిరిలో అత్యల్ప ఉష్ణోగ్రత 11.6 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. శేరిలింగంపల్లిలో 12.1 డిగ్రీల సెల్సియస్, రాజేంద్రనగర్‌లో 12.6 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. రామచంద్రపురం & పటాన్‌చెరువులో 12.8 డిగ్రీల సెల్సియస్, సికింద్రాబాద్, చందానగర్, కుత్బుల్లాపూర్‌లో వరుసగా 14 డిగ్రీల సెల్సియస్, 14 డిగ్రీల సెల్సియస్, 14.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. రానున్న రోజుల్లో ఈ ఉష్ణోగ్రతలు మరింత తగ్గుతాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.
రాష్ట్రంలో చలి తీవ్రత పెరుగుతుండడంతో జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఇప్పటికే చాలా మంది స్వెట్టర్లను బయటకు తీశారు.












Click it and Unblock the Notifications