తుక్కుగూడ నర్సు హత్య కేసు.. 30 గంటల్లోనే కేసును ఛేదించిన పోలీసులు..!
రంగారెడ్డి జిల్లా పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో సంచలనం సృష్టించిన నర్సు హత్య, అత్యాచారం కేసును పహాడీషరీఫ్ పోలీసులు, శంషాబాద్ జోనల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు 30 గంటల వ్యవధిలోనే ఛేదించారు. ఈ మేరకు సాంకేతిక ఆధారాలు, దర్యాప్తులో లభించిన సమాచారంతో నిందితుడు ఎండీ సనావుల్లా(34)ను అరెస్ట్ చేశారు. తుక్కు గూడలోని ప్రైమ్ కేర్ హాస్పిటల్ క్వార్టర్స్ లో నివాసం ఉంటున్న 21 ఏళ్ల యువతిని కిరాతకంగా హతమార్చి, లైంగిక దాడికి పాల్పడినట్లు పోలీసులు తేల్చారు. నిందితుడి వద్ద నుంచి నేరానికి ఉపయోగించిన మొబైల్ ఫోన్, దుస్తులను స్వాధీనం చేసుకున్నారు. అతనిపై బీఎన్ఎస్ చట్టంలోని హత్య, అత్యాచారం సెక్షన్లతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు.
ఇక హైదరాబాద్ సీపీ సజ్జనార్ పర్యవేక్షణలో.. శంషాబాద్ డీసీపీ రాజేష్, ఏసీపీ శ్రీకాంత్ గౌడ్ మార్గదర్శకత్వంలో పహాడీషరీఫ్ ఇన్ స్పెక్టర్ బీ లక్ష్మీనారాయణ రెడ్డి బృందం అలాగే శంషాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టి నిందితుడిని కేవలం 30 గంటల్లోనే అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. బిహార్ లోని బెగుసరాయ్ జిల్లాకు చెందిన సనావుల్లా.. పహాడీషరీఫ్ లోని ఆస్పత్రి సమీపంలో ఉన్న శ్రీ భాగ్యలక్ష్మి బైక్ మెకానిక్ షాప్ లో పనిచేస్తూ అక్కడే నివాసం ఉంటున్నాడు. మరోవైపు కొత్తగూడెం ప్రాంతానికి చెందిన 21 ఏళ్ల యువతి శిరీష గత 7 నెలలుగా తుక్కుగూడలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో నర్సుగా విధులు నిర్వర్తిస్తోంది. ఆస్పత్రి సమీపంలో ఉన్న సిబ్బంది క్వార్టర్స్ లో ఉంటూ రోజూ విధులకు వెళ్లి వచ్చేది.
ఈ క్రమంలో గత నెల రోజులుగా హాస్పిటల్ క్వార్టర్స్ లో ఉంటున్న శిరీష కదలికలపై నిఘా పెట్టాడు నిందితుడు సనావుల్లా. ఆమెపై కన్నేసి అఘాయిత్యానికి ప్లాన్ వేశాడు. అయితే రక్షా బంధన్ సందర్భంగా శిరీష రూమ్ మేట్ ఇంటికి వెళ్లిపోవడంతో ఆమె ఒక్కతే ఉంది. ఈ నేపథ్యంలో ఆగస్టు 28 అర్ధరాత్రి దాటిన తర్వాత సుమారు 12:30 గంటల సమయంలో కిటికీ గుండా బాధితురాలి గదిలోకి చొరబడ్డాడు సనావుల్లా. ఆమె మేల్కొని కేకలు వేయడంతో నోరు మూసి, గొంతు పట్టుకున్నాడు. ఈ క్రమంలో బాధితురాలు తీవ్రంగా ప్రతిఘటించి నిందితుడి వేలిని కొరకడంతో పాటు గొంతు, ఛాతీపై గోళ్లతో గాయాలు చేయడంతో నిందితుడు ఆమెపై దాడి చేసి, గొంతు నులిమి హతమార్చాడు. అనంతరం అత్యాచారానికి పాల్పడినట్లు దర్యాప్తులో వెల్లడైందని పోలీసులు తెలిపారు.

మరుసటి రోజు ఆగస్టు 29 ఉదయం శిరీష తన గది నుంచి ఎంతకూ బయటకు రాకపోవడంతో ఆమె స్నేహితురాలు కిటికీ ద్వారా గదిలోకి వెళ్లి చూడగా రక్తపు గాయాలతో ఆమె మృతి చెంది ఉంది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరోవైపు నర్సు శిరీష హత్యకు కారకులైన నిందితులను కఠినంగా శిక్షించాలని ప్రగతిశీల మహిళా సంఘం (POW) జిల్లా అధ్యక్షురాలు పెద్దగ్రోని ఆదిలక్ష్మి డిమాండ్ చేశారు. ఈ మేరకు కొత్తగూడెం రైటర్ బస్తీలో నిరసన వ్యక్తం చేశారు. మహిళలు, బాలికలు ఒంటరిగా బయటకు వెళ్లాలన్నా.. ఉద్యోగాలు చేయాలన్నా భయపడే పరిస్థితులు ఉండటం ఆందోళనకరమని ఆమె అన్నారు.












Click it and Unblock the Notifications