బీజేపీలో టికెట్లు వారికే.. అసంతృప్త నేతలకు బండి సంజయ్ షాక్!!
మరో ఐదు నెలల్లో తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు రాబోతున్నాయి. ఈసారి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించి మళ్లీ అధికారాన్ని చేజిక్కించుకొని మూడవసారి రాష్ట్రంలో పాలనా పగ్గాలు చేపట్టాలని బీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది. అయితే ఈసారి తెలంగాణలో ప్రభుత్వం పట్ల ఉన్న ప్రజావ్యతిరేకతను ఓటు బ్యాంకుగా మలచుకోవాలని బీజేపీ భావిస్తోంది. ఎలాగైనా ఈసారి అధికారంలోకి రావాలని, కాషాయ జెండాను ఎగురవేయాలని దృఢ సంకల్పంతో ఉంది.
ఈ క్రమంలోనే గత ఎన్నికల తరహాలో తప్పులు చేయకుండా ఈసారి ముందు నుండే బిజెపి జాగ్రత్త పడుతుంది. అభ్యర్థుల ఎంపికలోనూ తగు జాగ్రత్తలు తీసుకుంటూ కీలకంగా అడుగులు వేస్తుంది. క్షేత్రస్థాయిలో పని చేయకుండా, లాబీయింగ్ చేసే నేతలకు టికెట్లు ఇవ్వకూడదని బిజెపి నిర్ణయించింది. ప్రతి నియోజకవర్గం వారీగా సర్వేలు చేస్తూ ఆ నియోజకవర్గ ఓటర్ల అభిప్రాయాన్ని తెలుసుకుంటూ, ఎవరికైతే మెజారిటీ ప్రజలమద్దతు లభిస్తుందో వారికే టిక్కెట్లు ఇవ్వాలని బీజేపీ నిర్ణయించింది.

బీజేపీ తరఫున ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేయాలనే విషయంపై ఇప్పటికే బిజెపిలో చాలామంది నాయకులు ఇష్టానుసారం ప్రకటనలు చేస్తున్న నేపథ్యంలో, బిజెపిలో ఇటువంటివి నడవవని బండి సంజయ్ సుతిమెత్తగా హెచ్చరించారు. ఇదే సమయంలో టికెట్లు ఎవరికి ఇస్తాము అనే దానిపై క్లారిటీ కూడా ఇచ్చారు. ఎంత పెద్ద లీడర్ అయినా సరే సర్వే లో గెలిచిన వారికే టిక్కెట్లు ఇస్తామని బండి సంజయ్ ప్రకటించారు.
ఈ అంశంలో ఎటువంటి బేరసారాలు ఉండబోదని ఆయన ఖచ్చితంగా తేల్చి చెప్పారు. ఇక బండి సంజయ్ చేసిన తాజా ప్రకటనలతో కొంతమంది బండి సంజయ్ ను వ్యతిరేకించే నేతలలో ఆందోళన నెలకొంది. ఇప్పటికే బిజెపిలో ఈటల రాజేందర్ కు బండి సంజయ్ కు మధ్య పొసగడం లేదని చర్చ జరుగుతుంది. మరోపక్క బీజేపీలో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా బిజెపిలో కొత్తగా చేరిన వారికి బాధ్యతలు అప్పగించాలని కోరుతున్నారు.
కొత్తవారిని పట్టించుకోవడం లేదు అన్న తీవ్రవ్యాఖ్యలు చేశారు. ఇక తమ అసంతృప్తిని ఏదో ఒక రూపంలో బయటకు చెప్తున్న నేతలకు పార్టీ లైన్ దాటి మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరికలు జారీ చేశారు. బిజెపిలో ఉండాలి అంటే నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించారు. ఇక ఇదే సమయంలో వచ్చే ఎన్నికల్లో టికెట్ల విషయంలో ఎవరూ నోరు మెదపకూడదని, సర్వేలలో ప్రజల మద్దతు వచ్చిన వారికే టిక్కెట్లు ఇస్తామని తెలిపారు. దీంతో బిజెపిలో బండి సంజయ్ ను వ్యతిరేకించే వర్గాల్లో అంతర్గత మధనం మొదలైంది.












Click it and Unblock the Notifications