"అల్లు"డు కోసం ఢిల్లీలో "మెగా" ఆపరేషన్ - రేవంత్ నో కాంప్రమైజ్..!!
అల్లు అర్జున్ వ్యవహారం కొత్త టర్న్ తీసుకుంటోంది. పోలీసులు అల్లు అర్జున్ బెయిల్ రద్దు కోసం హైకోర్టులో పిటీషన్ కు సిద్దమయ్యారని తెలుస్తోంది. దీంతో, అల్లు - మెగా కాంపౌండ్ అలర్ట్ అయింది. అల్లు అర్జున్ ఇంటి పైన దాడి గురించి చర్చించినట్లు సమాచారం. తెలంగాణలో ఇక బెనిఫిట్ షోలు .. టికెట్ ధరలు పెంపు ఉండదని ప్రభుత్వ ప్రకటన సినీ పరిశ్రమకు షాక్ గా మారింది. దీంతో, ఢిల్లీ నుంచి ఆపరేషన్ ప్రారంభించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ నిర్ణయం మారేలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ పరిణామాలు ఆసక్తి కరంగా మారుతోంది.
మెగా కాంపౌండ్ అలర్ట్
అల్లు అర్జున్ కేసు రోజు రోజుకీ జటిలంగా మారుతోంది. బెయిల్ రద్దు కోసం పోలీసులు కోర్టును ఆశ్రయిస్తే కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఉత్కంఠ పెంచుతోంది. ఇప్పుడు తాజా పరిణామాలతో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది. కొత్త సినిమాల కు బెనిఫిట్ షో లు..టికెట్ ధరల పెంపుకు అనుమతి ఇవ్వమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించారు. ఇది టాలీవుడ్ కు బిగ్ షాక్ గా మారింది. సంక్రాంతి వేళ పెద్ద హీరోల సినిమాలు వరుసగా విడుదల కానున్నాయి. తెలుగు సినిమాలకు హైదరాబాద్ తో సహా తెలంగాణ జిల్లాలు ప్రధాన మార్కెట్ గా ఉన్నాయి.

రేవంత్ ఆగ్రహంతో
తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం ఏపీ పైనా ప్రభావం చూపుతుందనే అంచనాలు కనిపిస్తున్నాయి. దీంతో, తెలంగాణ ప్రభుత్వంలో సంప్రదింపుల కోసం మెగాస్టార్ ను రంగంలోకి దించేలా కొందరు సినీ ప్రముఖులు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్ అరెస్ట్ సమయంలో అతని ఇంటికి వెళ్లటం మినహా చిరంజీవి ఇప్పటి వరకు ఓపెన్ గా ఈ వ్యవహారం పైన స్పందించ లేదు. ఇక, బాధిత కుటుంబానికి సినిమా ముఖ్యులు బాసటగా నిలవకపోవటం పైనా ముఖ్యమంత్రి శాసన సభలో కీలక వ్యాఖ్యలు చేసారు. దీంతో, రేవంత్ ఆగ్రహం గుర్తించిన మెగా, అల్లు ఫ్యామిలీ ఢిల్లీ కేంద్రంగా ముందుగా చర్చలకు లైన్ క్లియర్ చేసుకోవాలనే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది.
రేవంత్ అంగీకరిస్తారా
చిరంజీవి గతంలో కాంగ్రెస్ లో కీలకంగా వ్యవహరించటంతో మెగాస్టార్ చొరవ తీసుకోవాలని సినీ ప్రముఖులు కోరుతున్నట్లు ఇండస్ట్రీలో ప్రచారం సాగుతోంది. తాజాగా తెలంగాణ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ దిల్ రాజుతోనూ చర్చించాలని భావిస్తున్నారు. అయితే, ఈ అంశంలో అసెంబ్లీ వేదికగా సీరియస్ గా స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి చట్టం ప్రకారం ముందుకు వెళ్లాలని ఇప్పటికే పోలీసులకు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. తమకు ఎవరి పైనా ద్వేషం లేదని.. అదే సమయంలో సినీ ప్రముఖులకు స్పెషల్ ప్రివిలేజ్ మాత్రం ఉండదని రేవంత్ తేల్చి చెప్పారు. దీంతో, ముందుగా ప్రభుత్వంతో చర్చల కోసం టాలీవుడ్ ప్రముఖులు ఢిల్లీ నుంచి ప్రయత్నాలు చేస్తున్నారు. మరి, రేవంత్ ఏ విధంగా స్పందిస్తారు .. ఏం చేయబోతున్నారనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications