కేసీఆర్ ను ఓడించాలని ఓటర్లలో కసి - బీజేపీ సహకరిస్తోంది: రేవంత్..!!
తెలంగాణ చరిత్ర చూస్తే.. ఆకలినైనా భరించింది కానీ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టలేదని టీపీసీసీ చీఫ్ రేవంత్ చెప్పుకొచ్చారు. కేసీఆర్ పాలనలో ప్రజలకు స్వేచ్ఛ, సమన్యాయం లేదంటూ విమర్శించారు. హక్కుల కోసం తెలంగాణ ప్రజలు మరోసారి ఉద్యమించాల్సిన పరిస్థితి వచ్చిందని పిలుపునిచ్చారు. నాలుగు కోట్ల ప్రజలకు స్వేచ్ఛ, సమానత్వం, అభివృద్ది ఇచ్చేందుకు కాంగ్రెస్ మ్యానిఫెస్టో రూపొందించిందని పేర్కొన్నారు.
నిజాంకు పట్టిన గతే: కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో అధికారంలోకి తీసుకురావాలన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్. గతంలో తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ సంక్షోభాన్ని ఎదుక్కొందని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రజాదర్భార్ ఏర్పాటు చేసి ప్రజల సమస్యలను పరిష్కరిస్తామన్నారు.

సమైక్య రాష్ట్రంలో సమాన అభివృద్ధి, సమాన అవకాశాలు దక్కలేదని.. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రజలను ద్వితీయ శ్రేణి పౌరులుగా చూశారని, అందుకే స్వేచ్ఛ, సమానత్వం, సమాన అభివృద్ధి కోసం తెలంగాణ ప్రజలు ఉద్యమించారని, కొట్లాడి తెలంగాణ సాధించుకున్నామని చెప్పారు. నిరంకుశ నిజాంకు పట్టిన గతే కల్వకుంట్ల కుటుంబానికి తెలంగాణ ప్రజలు రుచి చూపించబోతున్నారని రేవంత్ చెప్పుకొచ్చారు.
కేసీఆర్‌ను గద్దె దించాలి: ప్రజలను బానిసలుగా చూస్తున్న కేసీఆర్‌ను గద్దె దించాలని పిలుపిచ్చారు. తెలంగాణ ప్రజలకు ఇదే చివరి ఉద్యమం కావాలన్నారు. ఈ ఉద్యమం పరిపాలన కోసం, అధికారం కోసం కాదని.. తెలంగాణ ఆత్మగౌరవం కోసమని రేవంత్ స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో ప్రజలు విస్పష్టమైన తీర్పు ఇవ్వబోతున్నారని చెప్పారు. సీఎం కేసీఆర్‌కు ఫెడరల్ స్ఫూర్తి తెలియదని.. ఆయన రాచరికం అనుకుంటున్నారని.. రాష్ట్రాల ఆదాయం ఆధారంగా ప్రాధాన్యతలు ఉంటాయన్నారు.
రూ. 2వేల పెన్షన్ గురించి ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారని.. ఆయన ఇచ్చే పెన్షన్ కంటే కర్ణాటకలో పెన్షన్‌తో పాటు మహిళలకు అదనంగా నగదు బదిలీ అవుతోందని, కేసీఆర్ సవాల్‌లో పస లేదన్నారు. 60 నెలల్లో కేసీఆర్ పేదలకు రూ. ఒక లక్షా 80 వేలు బాకీ ఉన్నారని, 110 సీట్లలో డిపాజిట్లు రాని బీజేపీ బీసీ వ్యక్తిని సీఎంను చేస్తామనడం ఓబీసీలను అవమానించడమేనని రేవంత్ రెడ్డి అన్నారు.
కసితో ఉన్నారు: బలహీనవర్గాలు కేసీఆర్‌ను ఓడించాలన్న కసితో ఉన్నారని, ఆ ఓట్లను చీల్చి కేసీఆర్‌కు సహకరించడమే బీజేపీ వ్యూహమని దుయ్యబట్టారు. ఏబీసీడీ వర్గీకరణపై గతంలో వెంకయ్య నాయుడు సభ నిర్వహించి 100 రోజుల్లో చేస్తామన్నారు... ఇప్పటికీ అతీగతి లేదని ఎద్దేవా చేశారు. బిల్లు పెడితే మద్దతు ఇస్తామని కాంగ్రెస్ చెబుతున్నా.. బీజేపీ ఆ దిశగా చర్యలు చేపట్టడంలేదని విమర్శించారు. దళితుల ఓట్లు కాంగ్రెస్‌కు రాకుండ చీల్చేందుకే కమిటీతో కాలయాపన అని ఆరోపించారు.
వెళదాం... కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తామని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ధరణి పేరుతో పెద్ద ఎత్తున భూ దోపిడీ జరిగిందని, హైదరాబాద్ చుట్టూ ఉన్న లక్ష ఎకరాల నిజాం వారసుల భూములు చేతులు మారాయన్నారు. అందుకే ధరణి రద్దు చేస్తామంటే కేసీఆర్‌కు దుఃఖం వస్తోందన్నారు. కేసీఆర్ సీఎం హోదాలో అబద్దాలు చెప్పి ప్రజల్ని నమ్మించాలని చూస్తున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు.












Click it and Unblock the Notifications