కొండా పై కాంగ్రెస్ హైకమాండ్ కీలక నిర్ణయం..!?
తెలంగాణ కాంగ్రెస్ లో కొండా దంపతుల తీరు వివాదాస్పదంగా మారుతోంది. మంత్రిగా ఉంటూ కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తాజాగా, కొండా మురళీ సొంత పార్టీ నేత ల పైన చేసిన కామెంట్స్ పెద్ద ఎత్తున దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యల పైన పార్టీ అధినాయకత్వానికి ఫిర్యాదులు అందాయి. పార్టీ రాష్ట్ర నాయకత్వం పరిశీలకుల నుంచి నివేదిక లు తీసుకుంది. వరంగల్ జిల్లా నేతలు తాజా పరిణామాల పైన గుర్రుగా ఉన్నారు. తాజాగా అందిన నివేదికల ప్రకారం కొండా మురళీ పైన చర్యలకు పార్టీ నాయకత్వం నిర్ణయించినట్లు సమాచారం.
కొండా దంపతులు కాంగ్రెస్ లో వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తున్నారు. కొండా మురళి వ్యాఖ్యలపై ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఇతర నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి నివాసంలో జిల్లా పార్టీ నేతలు సమావేశమయ్యారు. కొండా దంపతులు సొంత పార్టీ నేతలపై చేస్తున్న వాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొండా మురళి చేసిన అనుచిత వ్యాఖ్యలను అధిష్ఠానం దృష్టికి తీసుకె ళ్లాలని నిర్ణయించారు. మంత్రి సురేఖతో ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు మొదటి నుంచి దూరం దూరంగానే ఉంటున్నారు. ఐదారుగురు ఎమ్మెల్యేలతో కొండా దంపతులకు రాజకీయ వైరం కొనసాగుతోంది. నర్సంపేట ఎమ్మెల్యేతో తొలి నుంచీ రాజకీయ విభేదాలు ఉన్నాయి.

ఇటీవలి కాలంలో పరకాల, వరంగల్ పశ్చిమ, వర్ధన్నపేట, భూపాలపల్లి ఎమ్మెల్యేలతో కూడా విభేదాలు వచ్చాయి. గతంలో మంత్రి సురేఖపై సీఎం రేవంత్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహే్‌షకుమార్‌గౌడ్‌లతో పాటు అప్పటి ఏఐసీసీ ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీకి కూడా వరంగల్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య ఫిర్యాదు చేశారు. వరుస వివాదాల నేపథ్యంలో పార్టీ రాష్ట్ర ఇంఛార్జ్ మీనాక్షీ నటరాజన్ జిల్లా పార్టీ పైన నివేదిక కోరినట్లు తెలుస్తోంది. పార్టీ పీసీసీ పరిశీలకులు జిల్లాలో పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు.. కొండా మురళీ వ్యాఖ్యల వివాదం పైన టీపీసీసీ చీఫ్ కు నివేదిక ఇచ్చినట్లు తెలుస్తోంది. పార్టీ నాయకత్వం పైన తాజా పరిణామాల పైన ఆరా తీసినట్లు సమాచారం. కొండా మురళీ వ్యాఖ్యలపైన పార్టీ నాయకత్వం చర్యలకు సిద్దమైనట్లు చెబుతున్నారు. దీంతో, పార్టీ ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తుందనే ఉత్కంఠ జిల్లా నేతల్లో కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications