వాహనదారులకు అలెర్ట్: ట్రాఫిక్ చలాన్లు ఫాస్టాగ్ నుంచే వసూలుకు బిగ్ ప్లాన్!
వాహనదారులకు బిగ్ అలెర్ట్. ట్రాఫిక్ రూల్స్ విషయంలో మరో కీలక నిర్ణయం దిశగా అడుగులు పడుతున్నాయి. హైదరాబాద్‌లో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులకు షాక్ ఇవ్వటానికి రంగం సిద్ధం అవుతుంది. ట్రాఫిక్ పోలీసులు ఈ-చలాన్ జరిమానాలను నేరుగా ఫాస్టాగ్ ఖాతా నుంచి ఆటోమేటిక్‌గా కట్ చేసే విధానాన్ని ప్రతిపాదిస్తున్నారు. సాంకేతికత సహాయంతో చలాన్ల వసూళ్లను వేగవంతం చేయడం, నిబంధనల ఉల్లంఘనలను తగ్గించడం లక్ష్యంగా అధికారులు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు సమాచారం.
ఫాస్టాగ్ ఖాతా నుంచి ఆటోమేటిక్‌గా కట్ చేసే విధానం ప్రతిపాదన
సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ వార్షికోత్సవ కార్యక్రమంలో జాయింట్ సీపీ సన్‌ప్రీత్ సింగ్ ఈ ప్రతిపాదన వివరాలు వెల్లడించారు. హెచ్‌ఎండీఏ అధికారులతో చర్చలు జరుగుతున్నాయని, అనుమతులు, సాంకేతిక అంశాలు పూర్తయిన తర్వాత అమల్లోకి తీసుకురావాలని భావిస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం కెమెరాలు, సాంకేతిక వ్యవస్థల ద్వారా ఉల్లంఘనలు గుర్తించి ఈ-చలాన్లు జారీ చేస్తున్నారు.కానీ చాలామంది జరిమానాలు వెంటనే చెల్లించకుండా పెండింగ్‌లో పెడుతున్నారు.

ఫాస్టాగ్‌తో అనుసంధానం చేస్తే జరిమానా మొత్తం వసూలు
దీంతో చాలావరకు పెండింగ్ చలాన్ లు చెల్లింపు జరగటం లేదు. దీనివల్ల బకాయిల వసూళ్లకు ప్రత్యేక చర్యలు అవసరమవుతున్నాయి. ఫాస్టాగ్‌తో అనుసంధానం చేస్తే జరిమానా విధించిన వెంటనే మొత్తం వసూలు కావడం సాధ్యమవుతుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఈ విధానం కేవలం వసూళ్లకే పరిమితం కాకుండా నగర ట్రాఫిక్ నిర్వహణలో సాంకేతికత వినియోగాన్ని పెంచే దిశగా వేసే కీలక అడుగుగా చూస్తున్నారు.
ఆటోమేటిక్ వసూలు అమల్లోకి వస్తే ఉల్లంఘనలపై తక్షణ ప్రభావం
పెరుగుతున్న వాహనాలు, రద్దీ, పార్కింగ్ సమస్యలు, ప్రమాదాలు తగ్గించేందుకు సమగ్ర ప్రణాళిక అవసరమని చెబుతున్నారు. ప్రజా రవాణా బలోపేతం, లాస్ట్‌మైల్ కనెక్టివిటీ, మల్టీ లెవల్ పార్కింగ్ సదుపాయాలు ఏర్పాటు చేయాలని సూచిస్తున్నారు. ఫాస్టాగ్ నుంచి ఆటోమేటిక్ వసూలు అమల్లోకి వస్తే ఉల్లంఘనలపై తక్షణ ఆర్థిక ప్రభావం పడుతుంది.
వాహనదారుల జేబులకు చిల్లు పడినట్టే
ఎప్పుడు చలాన్ పడితే అప్పుడే మన ఫాస్టాగ్ అకౌంట్ నుండి డబ్బు కట్ అవుతుంది. అయితే ఈ కొత్త ఫాస్టాగ్ విధానం ఎప్పుడు అమలవుతుంది? ఏ నిబంధనల ప్రకారం కట్ చేస్తారు? ముందస్తు సమాచారం ఎలా ఇస్తారు? వంటి అంశాలపై ఇంకా అధికారికంగా స్పష్టత రావాల్సి ఉంది. ఏది ఏమైనా ఈ విధానం అమలయితే వాహనదారుల జేబులకు చిల్లు పడినట్టే అన్న అభిప్రాయం వాహనదారుల నుండి వ్యక్తం అవుతుంది.













Click it and Unblock the Notifications