విషాదం ...ఇంటర్ పరీక్ష రాస్తూ కుప్పకూలిన విద్యార్ధి మృతి
తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్ పరీక్షలు గత నాలుగు రోజుల నుండి జరుగుతున్నాయి. అయితే ఈసారి ఇంటర్ పరీక్షలలో పలు విషాదకర సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. మొన్నటికి మొన్న వరంగల్ లో పరీక్ష రాస్తున్న విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఇక తాజాగా సికింద్రాబాద్ లో ఒక విద్యార్థి పరీక్ష రాస్తూ పరీక్ష కేంద్రంలోనే కుప్పకూలిపోయాడు. ఆసుపత్రికి తరలించే లోపే ప్రాణాలు విడిచాడు.
నాలుగు రోజుల క్రితం తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్ పరీక్షలు మొదలైన సంగతి తెలిసిందే. కాగా... ఓ ఇంటర్ విద్యార్థి పరీక్ష రాస్తూ.. ఎగ్జామ్ హాల్ లోనే కన్నుమూశాడు.ఈ విషాద సంఘటన సికింద్రాబాద్ లో చోటుచేసుకుంది. ఖమ్మం జిల్లాకు చెందిన గోపీరాజు శనివారం ఉదయం ఇంటర్ రెండవ సంవత్సరం పరీక్షకు హాజరయ్యాడు. సికింద్రాబాద్ ప్యారడైజ్ సమీపంలోని శ్రీ చైతన్య కాలేజీలో పరీక్ష రాస్తున్న అతడు ఉన్నట్టుండి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో గోపిరాజును సమీపంలోని ప్రయివేట్ ఆస్పత్రికి తరలించగా, అప్పటికే అతడు చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు. కాగా గోపీరాజు ఓ ప్రయివేట్ కళాశాలలో ఒకేషనల్ కోర్సు చదువుతున్నాడు.

విద్యార్థి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.అయితే.. విద్యార్థి ఎలా మృతిచెందాడు అనే విషయం మాత్రం తెలియరాలేదు. అయితే పరీక్ష రాస్తున్న సమయంలో హార్ట్ ఎటాక్ రావడంతో విద్యార్థి మృతి చెందినట్లుగా భావిస్తున్నారు. కానీ ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications