ప్రధానిపై టీఆర్ఎస్ ప్రివిలేజ్ నోటీసు - తెలంగాణను అవమానించారంటూ : రాజ్యసభలో..!!
తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రధాని మోదీ పైన ప్రివిలేజ్ నోటీసు ఇచ్చింది. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానానికి సమాధానంగా ప్రధాని ప్రసంగించిన సమయంలో...ఏపీ విభజన పైన ప్రధాని కీలక వ్యాఖ్యలు చేసారు. వాజ్ పేయ్ ప్రధానిగా ఉన్న సమయంలో ఎటువంటి వివాదాలు లేకుండా మూడు రాష్ట్రాలు ఏర్పాటు చేసారని ప్రధాని గుర్తు చేసారదు. తాము తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకం కాదని చెబుతూనే.. సభలో ఆమోదించిన తీరు పైన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వివాదానికి కారణమయ్యాయి.
Recommended Video

ప్రధాని వ్యాఖ్యలతో రాజకీయ కలకలం
లోక్ సభ తలుపులు మూసివేసి బిల్లును ఆమోదించారంటూ ప్రధాని వ్యాఖ్యానించటాన్ని టీఆర్ఎస్ నేతలు తప్పు బడుతున్నారు. దీని పైన తెలంగాణ వ్యాప్తంగా గులాబీ పార్టీ నేతలు నిరసనలు వ్యక్తం చేసారు. ఇక, పార్లమెంట్ లో ప్రధాని పైన ప్రివిలేజ్ నోటీసు ఇవ్వాలని నిర్ణయించారు. అందులో భాగంగా... ఎంపీలు కేశవరావు, సంతోష్, సురేశ్‌రెడ్డి, లింగయ్య యాదవ్‌తెలంగాణ బిల్లుపై ప్రధాని అభ్యంతరకరంగా మాట్లాడారంటూ 187వ నిబంధన కింద నోటీసు ఇచ్చారు. రాజ్యసభ సెక్రటరీ జనరల్‌కు నోటీసు అందజేసారు. తెలంగాణను అవమానించారంటూ ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

టీఆర్ఎస్ సీరియస్.. నోటీసు
రాజ్యాంగాన్ని అవమానించేలా మాట్లాడారని విమర్శించారు. తలుపులు మూసేసి బిల్లు పాస్ చేసారనటం రాజ్యంగ ఉల్లంఘన కిందకు వస్తుందని ఎంపీలు చెబుతున్నారు. ఇది సభ హక్కులను ఉల్లంఘించటమేనంటూ ఎంపీలు స్పష్టం చేసారు. పార్లమెంట్ లో పాసయిన బిల్లును అవహేళన చేయటం సరి కాదని ఆగ్రహం వ్యక్తం చేసారు. తెలంగాణ పై అభ్యంతరకరంగా మాట్లాడారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక, ఇప్పుడు ఈ నోటీసు పైన రాజ్యసభ ఛైర్మన్ ఏ రకంగా స్పందిస్తారు..ఏం జరగబోతోందనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది.

రాజ్యసభ ఛైర్మన్ నిర్ణయం కీలకంగా
ప్రధాని చేసిన వ్యాఖ్యల పైన టీఆర్ఎస్ ఎంపీలతో పాటుగా రాష్ట్ర మంత్రులు సైతం సీరియస్ గా స్పందించారు. ప్రధాని తిరిగి రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపేందుకు కుట్ర చేస్తున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేసారు. దీనికి బీజేపీ నేతలు సైతం రాజకీయంగా కౌంటర్ ఇస్తున్నారు. ఇక, ఇప్పుడు ప్రధాని పైన సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇవ్వటం ద్వారా ఈ వ్యవహారం మరింత వేడి రాజుకుంది. దీని పైన ఇప్పుడు రాజ్యసభ ఛైర్మన్ తీసుకోనే నిర్ణయం కీలకం కానుంది.












Click it and Unblock the Notifications