ముందస్తు ఎన్నికలపై కేసీఆర్ అభిప్రాయ సేకరణ, 2 స్థానాల్లో పోటీ?
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో ఉన్నారా? అంటే అవుననే ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది. పరిస్థితులు పూర్తిగా అనుకూలంగా ఉన్నాయని, ఇప్పుడే ముందస్తుకు వెళ్తే ఎక్కువ సీట్లు వస్తాయని తెరాస భావిస్తోందట.
ఈ నేపథ్యంలో కేసీఆర్ ముందస్తుకు వెళ్లాలని ఆలోచన చేస్తున్నారని అంటున్నారు. కేసీఆర్ రెండు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తారని కూడా అంటున్నారు. ఒకటి ఉత్తర తెలంగాణ, రెండు దక్షిణ తెలంగాణ. ఈ రెండు ప్రాంతాల నుంచి పోటీ చేయడం ద్వారా కూడా తెరాసకు సాధ్యమైనన్ని సీట్లు రాబట్టవచ్చునని ఆలోచిస్తున్నారని అంటున్నారు.

కేసీఆర్ పోటీ చేస్తే ఆ ప్రభావం చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఉంటుంది. అది తెరాసకు ప్లాస్ అవుతుంది. కాబట్టి ఆయన ఉత్తర, దక్షిణ తెలంగాణల నుంచి రెండు చోట్ల పోటీ చేస్తారని ప్రచారం సాగుతోంది.
సార్వత్రిక ఎన్నికలు మరెంతో దూరం లేవు. మహా అయిదే ఎనిమిది నెలలు లేవు. ఇలాంటి సమయంలో ముందస్తుకు వెళ్లే ఆలోచన నిజంగానే చేస్తున్నారా లేక ప్రచారమేనా అనేది తేలాల్సి ఉంది. అంతేకాదు, సోమవారం తెరాస కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ భేటీలోను ముందస్తు ఎన్నికలపై చర్చిస్తున్నారని అంటున్నారు.
వచ్చే ఎన్నికలకు (లేదా ముందస్తుకు) పార్టీని సన్నద్ధం చేసే లక్ష్యంతో తెరాస రాష్ట్ర కార్యవర్గ సమావేశం ప్రారంభమైంది. కేసీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. పార్టీ నిర్వహించిన సర్వే ఫలితాల ఆధారంగా ఎమ్మెల్యేలను అప్రమత్తం చేయడంతో పాటు పార్టీ ప్రతిష్టాత్మక కార్యక్రమాల నిర్వహణ, విస్తృతస్థాయి ప్రచారం లక్ష్యంగా ఈ సమావేశం నిర్వహించారు.
ముందస్తు అయినా, గడువు అయినా ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని పార్టీ నేతలకు ఆయన దిశా నిర్దేశనం చేశారని తెలుస్తోంది. అలాగే, ముందస్తు ఎన్నికలపై పార్టీ నేతల అభిప్రాయం తీసుకున్నారని తెలుస్తోంది. కాగా రాత్రి ఏడు గంటలకు కేసీఆర్ మీడియాతో మాట్లాడనున్నారు.












Click it and Unblock the Notifications