బండి బెయిల్ పిటీషన్ పై హైకోర్టు - లోక్ సభ బులిటెన్..!!
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బెయిల్ పిటిషన్ పై విచారణను హైకోర్టు ఏప్రిల్ 10కి వాయిదా వేసింది. బెయిల్ పిటిషన్ దాఖలు చేయడానికి హైకోర్టు అనుమతి మంజూరు చేసింది. సంజయ్ పై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆయన తరపు న్యాయవాది వాదించారు. బెయిల్ పిటిషన్ పై ఈ రోజే నిర్ణయం తీసుకునేలా కింది కోర్టుకు ఆదేశాలు ఇవ్వాలని ఆయన కోరారు. అటు అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్ పై లోక్ సభ సెక్రటేరియట్ బులిటెన్ రిలీజ్ చేసింది.
హైకోర్టులో విచారణ: పదో తరగతి పరీక్షా పత్రాల లీకేజీ వ్యవహారంలో అరెస్ట్ అయిన బండి సంజయ్ బెయిల్ పిటీషన్ పై హైకోర్టులో విచారణ సాగింది. బండి సంజయ్ కు బెయిల్ పిటిషన్ పై దాఖలు చేసిన పిటిషన్ పై విచారించిన హైకోర్టు.. ఈ కేసులో ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.
ఏప్రిల్ 7, 8, 9 మూడు రోజుల పాటు సెలవులు ఉన్నాయని బండి సంజయ్ న్యాయవాది, మాజీ ఎమ్మెల్సీ రాంచందర్ రావు వాదించడంతో బెయిల్ పిటిషన్ దాఖలు చేయడానికి హైకోర్టు అనుమతి మంజూరు చేసింది. A1 గా బండి సంజయ్ పై మోపిన ఆరోపణలకు ఆధారాలేమైనా ఉన్నాయా అని నిలదీసింది. ఆ తర్వాత బండి సంజయ్ కు బెయిల్ పిటిషన్ వేసుకునే స్వేచ్ఛ ఉందంటూ కోర్టు స్పష్టం చేసింది.

తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ: బండి సంజయ్ తరపు మాజీ ఎమ్మెల్సీ రాంచందర్ రావు వాదనలు వినిపించారు. సంజయ్ పై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు. ప్రధాని మోడీ పర్యటన సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో బండి సంజయ్ హాజరవ్వాలని, వరంగల్ కోర్టులో దాఖలైన బెయిల్ పిటిషన్ పై ఈ రోజే నిర్ణయం తీసుకునేలా కింది కోర్టుకు ఆదేశాలు ఇవ్వాలని ఆయన కోరారు.
పబ్లిక్ డొమైన్ లోకి వచ్చాక లీకేజ్ ఎలా అవుతుందని హైకోర్టు ఈ సందర్భంగా ప్రశ్నించింది. ఓ పొలిటిషియన్ గా బండి సంజయ్ కు ప్రశ్న పత్రం వస్తే.. దానికే ఆయనను దోషిగా ఎలా పరిగణిస్తారంటూ కోర్టు ప్రశ్నించింది. వరంగల్ లోయర్ కోర్టులో బండి సంజయ్ బెయిల్ పిటిషన్ ప్రస్తుతం పెండింగ్ ఉండగా.... ఒకవేళ దాన్ని డిస్మిస్ చేస్తే.. హైకోర్టులో హౌస్ మోషన్ కింద బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవచ్చని కోర్టు చెప్పినట్టు రాంచందర్ రావు స్పష్టం చేశారు.
లోక్ సభ సెక్రటేరియట్ బులిటెన్ : బండి సంజయ్ అరెస్ట్ పై లోక్ సభ సెక్రటేరియట్ బులిటెన్ రిలీజ్ చేసింది. 151 సీఆర్పీసీ కింద ముందస్తు కస్టడీలోకి తీసుకున్నామని బొమ్మల రామారం పోలీసులు తెలిపినట్లు బులిటెన్ లో తెలిపింది. కరీంనగర్ లో సంజయ్ ని అరెస్ట్ చేసి తర్వాత రాజకొండ పరిధిలోని బొమ్మల రామారం స్టేషన్ కు తరలించినట్లు బులిటెన్ లో వెల్లడించారు.
అనంతరం కస్టడీ నుంచి విడిచిపెట్టినట్లు లోక్ సభ ప్రివిలేజ్ కమిటీకి కరీంనగర్ పోలీసులు తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నందుకే బండి సంజయ్ ని అరెస్ట్ చేసినట్లు పోలీసులు లోక్ సభ సచివాలయానికి సమాచారం ఇచ్చినట్లుగా బులెటిన్ లో పేర్కొన్నారు. ఈ నెల 8న ప్రధాని మోదీ హైదరాబాద్ కు వస్తున్న వేళ.. బండి సంజయ్ బెయిల్ అంశం పార్టీలో ఉత్కంఠకు కారణమవుతోంది.












Click it and Unblock the Notifications