TS Polls: హైదరాబాద్ సెటిలర్ల ఓటు ఎవరికంటే ? కీలక కారణం అదే...
ఏపీ నుంచి తెలంగాణ విడిపోయిన తర్వాత హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ సంఖ్యలో ఉన్న సెటిలర్లంతా ఎటు మొగ్గాలనే చర్చ వచ్చింది. అప్పట్లో తెలంగాణ విడిపోతున్న సమయంలో ఆంధ్రోళ్ల పేరుతో ఎదురైన అవమానాలు సెటిలర్లలో ఆక్రోశం పెంచాయి. అయితే తెలంగాణ ఏర్పాటు తర్వాత మాత్రం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన
టీఆర్ఎస్(ప్రస్తుతం బీఆర్ఎస్)వైపు వారిని మొగ్గేలా చేశాయి. కానీ 9 ఏళ్ల తర్వాత ఇప్పుడు చూస్తే పరిస్ధితి ఒక్కసారిగా మారింది.
ఏపీలో చంద్రబాబు అరెస్టు తర్వాత తెలంగాణలో హైదరాబాద్ తో పాటు పలు ప్రాంతాల్లో ఆయన అనుకూల నిరసనలు జరిగాయి. వీటి విషయంలో అప్పటికే ఏపీలో వైసీపీ సర్కార్ తో సఖ్యతగా ఉంటున్న బీఆర్ఎస్ ప్రభుత్వం కఠిన వైఖరి అవలంబించింది. ముఖ్యంగా హైదరాబాద్ లో ఐటీ ఉద్యోగుల నిరసనల్ని అడ్డుకోవడంతో పాటు వారికి తాము పనిచేస్తున్న సంస్ధల నుంచి నోటీసులు కూడా ఇప్పించింది. దీంతో ఈ వ్యవహారం సెటిలర్లలో బీఆర్ఎస్ పట్ల ఆగ్రహాన్ని పెంచింది.

ఇప్పుడు తెలంగాణ ఎన్నికల్లో ఆ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. హైదరాబాద్ లో భారీ సంఖ్యలో ఉన్న సెటిలర్లు ఈసారి బీఆర్ఎస్ కు పూర్తిగా దూరమైనట్లే కనిపిస్తోంది. బీఆర్ఎస్ కు బదులుగా ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఓటేసేందుకు వారంతా మొగ్గు చూపిస్తున్నారు. వీరంతా చంద్రబాబుకు అనుకూలంగా, ఇంకా చెప్పాలంటే టీడీపీకి అనుకూలంగా ఉంటున్న వారే. తెలంగాణలో టీడీపీ కనుమరుగైన తర్వాత వీరంతా బీఆర్ఎస్ కు మద్దతిస్తూ వచ్చారు. కానీ తాజా పరిణామాల్లో పెరిగిన బీఎర్ఎస్ వ్యతిరేకత ఇప్పుడు వారిని కాంగ్రెస్ కు దగ్గర చేస్తోంది.
ముఖ్యంగా హైదరాబాద్ చుట్టూ ఉన్న సైబరాబాద్ పరిధిలో వ్యాపారాలు, ఐటీ, ఫార్మా ఉద్యోగాలు చేసుకుంటున్న సెటిలర్లు ఈసారి కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు. దాదాపు పదేళ్ల పాలన తర్వాత కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంపై రాని వ్యతిరేకత తాజాగా కేటీఆర్ వ్యాఖ్యల తర్వాత మాత్రం ఒక్కసారిగా వచ్చింది. దీంతో వీరిని బుజ్జగించేందుకు బీఆర్ఎస్ చాలా ప్రయత్నాలు చేస్తోంది. అయినా ఫలితం మాత్రం కనిపించడం లేదు. ఇలా కేటీఆర్ వ్యాఖ్యలు సెటిలర్లను బీఆర్ఎస్ కు దూరం చేసి కాంగ్రెస్ కు దగ్గర చేసినట్లు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.












Click it and Unblock the Notifications