TS polls: మారిన కేసీఆర్ టోన్-ఇప్పుడు బీఆర్ఎస్ కాదు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే...
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పార్టీగా బీఆర్ఎస్, నేతగా కేసీఆర్ ఇన్నాళ్లూ చేసిన రాజకీయాలు ఓ ఎత్తయితే ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల వేళ మారుతున్న రాజకీయం మరో ఎత్తుగా మారిపోయింది. దీనికి కారణం పదేళ్ల బీఆర్ఎస్ సర్కార్ పై ప్రజా వ్యతిరేకత పెరగడమే. దీన్ని కర్నాటక ఎన్నికల్లో విజయ తర్వాత చక్కగా క్యాష్ చేసుకున్న కాంగ్రెస్ చెలరేగిపోతోంది. దీంతో కేసీఆర్ కూడా టోన్ మార్చేస్తున్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం మొదలుపెట్టే సమయానికి కేసీఆర్ కానీ బీఆర్ఎస్ నేతలు కానీ తిరిగి తాము అధికారంలోకి వస్తే భారీ ఎత్తున సంక్షేమం అమలు చేస్తామని హామీలు ఇచ్చారు. అప్పటికే కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు ప్రకటించడంతో దీనికి కౌంటర్ గా కేసీఆర్ భారీ మ్యానిఫెస్టో విడుదల చేశారు. దీంతో మరోసారి బీఆర్ఎస్ కు అధికారమిస్తే ఈ హామీలన్నీ అమలు చేసి చూపిస్తామని కేసీఆర్ తో పాటు బీఆర్ఎస్ నేతలు కూడా ఊరూవాడా ప్రచారం చేశారు. కానీ సమయం గడిచే కొద్దీ రాష్ట్రంలో రాజకీయం మారుతున్న సంకేతాలు వారికి అందుతున్నాయి.

ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తాజాగా టోన్ మార్చేసినట్లు కనిపిస్తోంది. తొలుత చెప్పిన బీఆర్ఎస్ ను మరోసారి గెలిపిస్తే అనే నినాదం నుంచి ఇప్పుడు కాంగ్రెస్ కు అధికారమిస్తే అనే నినాదం ఎక్కువగా వినిపిస్తున్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే గతం కంటే మంచి పాలన అందిస్తామని, సంక్షేమం, అభివృద్ధిలో తెలంగాణను మేటిగా చేస్తామని గతంలో చెప్పుకున్న కేసీఆర్... ఇప్పుడు కాంగ్రెస్ కు అధికారమిస్తే, రేవంత్ రెడ్డికి అధికారమిస్తే అంటూ ప్రతీ బహిరంగసభలోనూ ఓటర్లను హెచ్చరించే పనిలో ఉన్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటరు నాడిని సర్వేలు కూడా పూర్తి స్ధాయిలో పట్టే పరిస్ధితి లేదు. కానీ క్షేత్రస్ధాయిలో ఉన్న అన్ని పార్టీల నేతలు, కార్యకర్తలు, ఆయా పార్టీల అధినేతలకు మాత్రం క్లారిటీ ఉన్నట్లే కనిపిస్తోంది. తాజాగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దూకుడు, దాంతో ఆయన్ను కట్టడి చేసేందుకు కేసీఆర్ చేస్తున్న వ్యాఖ్యలు తెలంగాణ ఓటర్లకు కావాల్సినంత స్పష్టత ఇచ్చేస్తున్నాయి. ముఖ్యంగా కేసీఆర్ పై వ్యతిరేకత తక్కువే అయినా బీఆర్ఎస్ నేతలు, ఎమ్మెల్యేల్ని మరోసారి భరించే పరిస్దితి లేదంటున్నారు. దీంతో కేసీఆర్ తమ పార్టీ నేతల్ని సమర్ధించుకోలేక, కాంగ్రెస్ కు మాత్రం అధికారం ఇవ్వొద్దంటూ ప్రచారంలో పదే పదే చెప్తున్నారు.












Click it and Unblock the Notifications