తెలంగాణా గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్, ఉద్యమ గాయకుడు సాయిచంద్ మృతి; సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి!!
ఉద్యమ గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్ గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. ప్రస్తుతం సాయి చంద్ వయస్సు 39 సంవత్సరాలు. తెలంగాణ ఉద్యమంలో సాయిచంద్ కీలక భూమిక పోషించారు. విద్యార్థి దశ నుండే గాయకుడిగా ఎంతో పేరు తెచ్చుకున్నారు సాయిచంద్. తెలంగాణ ఉద్యమ సమయంలో తన పాటలతో అందులోనూ ఉద్యమ స్ఫూర్తిని రగిలించిన గాయకుడిగా సాయి చంద్ కు గుర్తింపు ఉంది.
సాయి చంద్ నాగర్ కర్నూల్ కారుకొండ లోని ఒక ఫామ్ హౌస్ లో ఉండగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. నాగర్ కర్నూల్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందిన ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం ఆయనను హైదరాబాద్ గచ్చిబౌలిలోని కేర్ ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు సాయి చంద్ మరణించినట్లు ధ్రువీకరించారు.

సాయి చంద్ గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు పేర్కొన్నారు. రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయి చంద్ మృతిపట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన మరణం పట్ల సంతాపాన్ని ప్రకటించారు. చిన్న వయసులోనే సాయి చంద్ మరణం తనను కలచి వేసిందని తెలంగాణా సీఎం కేసీఆర్ తెలిపారు.
సాయి చంద్ మరణంతో తెలంగాణ ఒక గొప్ప గాయకుడిని, కళాకారుడిని కోల్పోయిందని పేర్కొన్నారు. చిన్నతనంలోనే అద్భుతమైన ప్రతిభ ను సొంతం చేసుకున్న బిడ్డ సాయిచంద్ అని ఉన్నత స్థాయికి ఎదిగే ఈ సమయంలో ఆయన మరణం ఎంతో బాధాకరమని తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యక్తం చేశారు.
అంతేకాదు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ కాలంలో సాయి చంద్ పాడిన పాటలు నింపిన ఉద్యమ స్ఫూర్తిని గుర్తు చేసుకున్న కేసీఆర్, సాయిచంద్ పాత్ర తెలంగాణ సాధనలో అజరామరంగా నిలుస్తుందని చెప్పారు. శోక సప్త హృదయం తో ఉన్న సాయి చంద్ కుటుంబ సభ్యులకు ఈ తీవ్రమైన విషాదాన్ని తట్టుకునే శక్తిని ఇవ్వాలని ఆ భగవంతుడిని ప్రార్ధిస్తున్నాను అని కెసిఆర్ అన్నారు.












Click it and Unblock the Notifications