తెలంగాణ ఆర్టీసీలో మరో కొత్త స్కీమ్
హైదరాబాద్: ప్రయాణికులను మరింత ఆకట్టుకునే దిశగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అధికారులు మరో కొత్త పథకాన్ని ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే టికెట్లపై పలు రాయితీలను కల్పించారు. పర్యాటకాభివృద్ధి సంస్థ తరహాలో ప్రత్యేక ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకొచ్చారు.
ఇప్పుడు తాజాగా టీ9-30 పేరుతో ప్రత్యేకంగా టికెట్ల పథకాన్ని అమలు చేయనున్నారు. ప్రస్తుతం ఉన్న టీ9-60 తరహాలోనే దీన్ని కూడా డిజైన్ చేశారు. ప్రయాణికులపై ఛార్జీల భారాన్ని తగ్గించడంలో భాగంగా ఈ టీ9-30 టికెట్‌ను టీఎస్ఆర్టీసీ అధికారులు ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకుని రానున్నారు.

టీ9-60 టికెట్లకు ప్రయాణికుల నుంచి మంచి స్పందన లభించడం వల్ల- కొత్తగా టీ9-30కి శ్రీకారం చుట్టారు. ఈ టికెట్ ధర 50 రూపాయలు. ఈ టికెట్ తీసుకున్న ప్రయాణికులు సంబంధిత డిపో నుంచి 30 కిలోమీటర్ల పరిధిలో రాకపోకలు సాగించవచ్చు. మళ్లీ ప్రత్యేకంగా ఎలాంటి టికెట్‌ను కూడా తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఉదయం 9 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు ఈ టికెట్ చెల్లుబాటు అవుతుంది.
తొలి టికెట్‌ను గురువారం ఉదయం విక్రయించనున్నారు. టీఎస్ఆర్టీసీ పరిధిలో పల్లె వెలుగు బస్సుల్లో కండక్టర్ల వద్ద ఈ టీ9-30 టికెట్స్ లభిస్తాయి. ఈ టికెట్ తీసుకుని 30 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ఇతర రాష్ట్రాలకు కూడా వెళ్లి వచ్చే వీలు ఉంది. టీ9-30 టికెట్ తీసుకున్న ప్రయాణికులు అదనంగా మరో 20 రూపాయలను చెల్లిస్తే- ఎక్స్‌ప్రెస్ బస్సుల్లోనూ ప్రయాణించవచ్చు.

ప్రస్తుతం దీన్ని ప్రయోగాత్మకంగా అమలులోకి తీసుకుని రానున్నారు. నెల రోజుల పాటు దీని తీరుతెన్నులపై పరిశీలిస్తారు. ఆ తరువాత దీన్ని కొనసాగించాలా? వద్దా? అనే విషయంపై ఓ నిర్ణయానికి వస్తారు టీఎస్ఆర్టీసీ అధికారులు. ప్రయాణికుల నుంచి ఆశించిన స్థాయిలో డిమాండ్ ఉంటే దీన్ని పూర్తిస్థాయిలో కొనసాగిస్తారు. ఈ టికెట్ పూర్తి వివరాల కోసం టీఎస్‌ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-23450033కు ఫోన్ చేయవచ్చు.












Click it and Unblock the Notifications