TS RTC:భాగ్యనగర వాసులకు టిఎస్ ఆర్టీసీ అధికారుల సూచన..
భాగ్యనగర వాసులకు తెలంగాణ ఆర్‌టిసి అధికారులు పలు సూచనలు చేశారు. ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు సిటీ బస్సుల్లో ప్రయాణించేవారు తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవటం ఉత్తమమని అధికారులు అంటున్నారు. ఎందుకంటే, ఆ నాలుగు రోజులు నగరంలో సిటీ బస్సుల సంఖ్య తగ్గనుంది.
కాబట్టి బస్సు ప్రయాణం చేసేవారు వారి ప్రయాణాలను వాయిదా వేసుకోవడమో లేక, ఇతర మార్గాలను చూసుకోవటమో చేయాలి. ఈ నెల 21 నుంచి 24 వరకు మేడారం జాతర సందర్భంగా భక్తుల రద్దీ పెరగనుంది. ఈ నేపథ్యంలో భక్తులకోసం సుమారు 2వేల బస్సులను కేటాయించారు. దీంతో ఆ నాలుగురోజుల పాటు ఇతర ప్రయాణికుల బస్సుల సంఖ్య తగ్గిపోయింది.

గ్రేటర్ హైదరాబాద్ జోన్ పరిధిలో తిరిగే 2,850 సిటీ బస్సుల్లో సుమారు రెండు వేల బస్సులు మేడారం జాతరకు వెళ్లనున్నాయి. దీంతో భాగ్యనగర ప్రయాణికుల కోసం కేవలం 850 బస్సులు మాత్రమే అందుబాటులో ఉండనున్నాయి. ఇందులో 250 బస్సులు సిటీ నుంచి బయలుదేరుతున్నాయి. మిగిలిన బస్సులు రాష్ర్టంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లనున్నాయి. ఆ నాలుగు రోజుల్లో పనులు పెట్టుకుని ఆటోలు, క్యాబ్‌ల దోపిడీకి గురికావొద్దనే ఉద్దేశంతో టిఎస్ ఆర్‌టిసి అధికారులు ప్రయాణికులను హెచ్చరిస్తున్నారు.
11 లక్షల నుంచి 18 లక్షలకు చేరిన మహిళ ప్రయాణికుల సంఖ్య..
ఇప్పటికే హైదరబాద్ నగరంలోని కొన్ని బస్సులను ఆర్టీసీ అధికారులు జాతరకు కేటాయించగా..ఇక, ఈ నెల 21 నుంచి పూర్తి స్థాయిలో బస్సులు మేడారానికి తరలి వెళ్లనున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, మహాలక్ష్మి పథకం కింద నగరంలోని మహిళా ప్రయాణికుల సంఖ్య అమాంతం పెరిగింది. సుమారు 11 లక్షల నుంచి 18 లక్షలకు చేరింది. ఈ పరిస్థితి రాష్ట్ర మొత్తంలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలో తెలంగాణ కుంభమేలాగా పిలవబడే మేడారం జాతరకి లక్షలాది మంది భక్తులు ప్రయాణిస్తున్నారని టిఎస్ ఆర్‌టిసి అధికారులు అంచనా వేశారు. అందుకే మేడారం జాతరకోసం ఏకంగా రెండువేల బస్సులను కేటాయించారు. కేవలం 850 బస్సులు మాత్రమే నగర ప్రయాణికుల సౌకర్యార్థం ఉంటాయి. ఇలాంటి సమయంలో ప్రయాణాలు చేయాలనుకునేవారు తమ ప్రణాళికలను వాయిదా వేసుకుంటే ఉత్తమమని ఆర్‌టిసి అధికారులు సూచిస్తున్నారు.












Click it and Unblock the Notifications