CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డితో టీటీడీ అధికారి భేటీ..
తిరుమల తిరుపతి దేవస్థానం అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని సీఎం నివాసానికి వచ్చిన ఆయన ముఖ్యమంత్రి రేవంత్ తో భేటీ అయ్యారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత పెరిగింది. కొద్ది రోజులుగా తెలంగాణ ప్రజాప్రతినిధులు తిరుమల దర్శనాలపై అసంతృప్తిగా ఉన్నారు. తమ సిఫార్సు లేఖలను పరిగణలోకి తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ అంశంపై ఈ భేటీలో చర్చ జరిగినట్లు తెలిసింది. అలాగే తెలంగాణలో టీటీడీ కల్యాణ మండపాల నిర్మాణంపై కూడా చర్చ జరిగినట్లు సమాచారం. తిరుమలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున వసతి భవనం నిర్మాణం వంటి అంశాలు కూడా ఈ భేటీలో చర్చించినట్లు తెలుస్తోంది.
రెండు నెలల క్రితం తెలంగాణ ప్రజా ప్రతినిధుల జారీ చేసే సిఫార్స్ లేఖలు అనుమతించకపోవడంపై జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రాలు యాదాద్రి, భద్రాచలంలో దేవుడు దర్శనానికి వచ్చే ఆంధ్ర ప్రజా ప్రతినిధుల సిఫార్స్ లేఖలను తమ ప్రభుత్వం అనుమతి ఇస్తుందని గుర్తు చేశారు. తమ సొంత మనుషులు, పార్టీ కార్యకర్తలు తిరుమలలో శ్రీవారి దర్శనానికి వెళ్తామని.. రూమ్ ఇప్పించండి అంటే.. ఇప్పించలేని పరిస్థితి ఉందన్నారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉంటే తెలుగుదేశం పార్టీ వాళ్లు హైదరాబాద్‌లో ఉంటున్నారు. అలాగే టీడీపీ ప్రభుత్వం ఉంటే వైసీపీ వాళ్లు హైదరాబాద్ వచ్చి ఉంటారన్నారని గుర్తు చేశారు.
ఏపీ వాళ్లు హైదరాబాద్‌లో బిజినెస్ చేసుకున్నా.. తెలంగాణ వాళ్లు ఏనాడు ఒక్క మాట కూడా వాళ్లని అనలేదని చెప్పారు. తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్స్ లేఖలు టీటీడీ అనుమతించకపోతే.. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో తాము తీసుకునే నిర్ణయంతో బాధ పడాల్సి వస్తుందని చెప్పారు. ఈ నేపథ్యంలో టీటీడీ అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.












Click it and Unblock the Notifications