హైదరాబాద్ వాసులకు తీపికబురు.. ట్రాఫిక్ కు చెక్ పెట్టేలా టన్నెల్ రోడ్స్!
హైదరాబాద్ నగరం వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో అంతే వేగంగా రోడ్డు రవాణా సమస్యలు కూడా పెరిగాయి . ముఖ్యంగా ఐటీ కారిడార్ల ప్రాంతాల్లో ఉదయం సాయంత్రం ట్రాఫిక్ జామ్‌లు ఉద్యోగుల జీవితాలను ఇబ్బంది పెడుతున్నాయి. ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఒక వినూత్నమైన ప్రతిపాదనను ముందుకు తెచ్చింది. నగరంలో భూగర్భ టన్నెల్ రోడ్లను నిర్మించి ట్రాఫిక్ రహిత ప్రయాణాన్ని సాధ్యం చేయాలని నిర్ణయించింది.
హైదరాబాద్ ఎకనామిక్ ఫోరం 2026 సదస్సులో ముఖ్యమైన ప్రకటన చేసిన మంత్రి
ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఖజాగూడలోని ఎస్‌ఏఎస్‌ఐ టవర్‌లో జరిగిన హైదరాబాద్ ఎకనామిక్ ఫోరం 2026 సదస్సులో ఈ ముఖ్యమైన ప్రకటన చేశారు. ఐటీ కంపెనీలు, కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగుల సౌకర్యం కోసం ఈ టన్నెల్ రోడ్లు ప్రత్యేకంగా ఉపయోగపడతాయని ఆయన వివరించారు. ఈ ప్రాజెక్టు అమలులోకి వచ్చిన తర్వాత హైదరాబాద్ నగరవాసులు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా సుఖంగా ప్రయాణం చేయగలరని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

భూగర్భ మార్గాల ద్వారా అదనపు పరిష్కారం కోసం ప్రభుత్వం ప్లాన్
ప్రస్తుతం నగరంలో ప్లైఓవర్లు, అండర్‌పాసులు, ఎలివేటెడ్ కారిడార్ల వంటి మౌలిక సదుపాయాలు భారీగా అభివృద్ధి చేస్తున్నా, ట్రాఫిక్ సమస్య పూర్తిగా తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో భూగర్భ మార్గాల ద్వారా అదనపు పరిష్కారం కోసం ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. ఈ టన్నెల్స్ ద్వారా ఐటీ హబ్‌లైన హైటెక్ సిటీ, గచ్చిబౌలి, మధాపూర్, నానక్‌రామగూడ వంటి ప్రాంతాల మధ్య సంబంధాలు మరింత సులభం అవుతాయి.
హైదరాబాద్‌ను దేశంలోనే అత్యుత్తమ ఇన్నోవేషన్ హబ్‌గా మార్చే ప్లాన్
ఇది సమయం ఆదా చేయడంతో పాటు, ఇంధన వినియోగం తగ్గించి పర్యావరణానికి కూడా లాభదాయకంగా ఉంటుంది. ఈ సదస్సులో మంత్రి శ్రీధర్‌బాబు హైదరాబాద్‌ను దేశంలోనే అత్యుత్తమ ఇన్నోవేషన్ హబ్‌గా, ఏఐ సిటీగా అభివృద్ధి చేసే ప్రభుత్వ దృక్పథాన్ని వివరించారు. టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్‌తో కలిసి క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.
హైదరాబాద్ ను ఫ్యూచర్ సిటీగా మార్చే దిశగా చర్యలు
టీ-హబ్, టీ-వర్క్స్ వంటి సంస్థలు స్టార్టప్‌లకు బలమైన మద్దతు అందిస్తున్నాయని చెప్పారు. ఒక స్థానిక స్టార్టప్ సంస్థ త్వరలో అంతరిక్షంలోకి ఏఐ ల్యాబ్‌ను పంపించనుండటం రాష్ట్రానికి గర్వకారణమన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో హైదరాబాద్‌ను భారతదేశం యొక్క ఫ్యూచర్ సిటీగా మార్చే దిశగా చర్యలు తీసుకుంటున్నామన్నారు . ఇప్పటికే దేశంలో మొదటి డేటా ఎక్స్ఛేంజ్ ప్లాట్‌ఫాం ప్రారంభించిన ఘనత తెలంగాణదని ఆయన పేర్కొన్నారు.
భూగర్భ టన్నెల్ రోడ్ల ప్రాజెక్టుతో మరింతగా హైదరాబాద్ పురోగతి
గత ఏడాది 70 గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లను ఆకర్షించిన రాష్ట్రం ఈ ఏడాది మరో 100ని తీసుకురావాలని లక్ష్యంగా పని చేస్తోంది. భారత్ ఫ్యూచర్ సిటీలో ఏఐ సిటీ కోసం 200 ఎకరాలు కేటాయించడం ఈ దిశలో ఒక ముఖ్యమైన అడుగు అని ఆయన పేర్కొన్నారు. భూగర్భ టన్నెల్ రోడ్ల ప్రాజెక్టు హైదరాబాద్ రవాణా వ్యవస్థలో ఒక చారిత్రక మైలురాయిగా నిలుస్తుందని నిపుణులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు..












Click it and Unblock the Notifications