దారుణ హత్యలు: ఇద్దరు విద్యార్థినుల మృతదేహాలు లభ్యం, విడివిడిగా శరీర భాగాలు
వరంగల్: జిల్లాలోని చెన్నారావుపేట మండల కేంద్రానికి సమీపంలో ఆదివారం రెండు మృతదేహాలు బయటపడడం సంచలనం సృష్టించింది. ఆ మృతదేహాలు నెల కిందట అదృశ్యమైన గిరిజన విద్యార్థినులవి కావడం గమనార్హం. కాగా, ఆ మృతదేహాల శరీర భాగాలు విడివిడిగా పడివున్నాయి. ఆ విద్యార్థులు హత్యకు గురైనట్లుగా పోలీసులు భావిస్తున్నారు.
ఈ దారుణానికి సంబంధించి పోలీసులు, మృతుల తల్లిదండ్రుల వివరాల ప్రకారం.. పర్వతగిరి మండలం నారాయణపురం గ్రామ శివారులోని కమ్మాలకుంటతండా తండాకు చెందిన బానోతు బాలు, కమలమ్మ దంపతుల కుమార్తె ప్రియాంక(14), బానోతు కిషన్-యాకమ్మ దంపతుల కుమార్తె భూమిక(14) నల్లబెల్లి మండలం మూడుచెక్కలపల్లి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నారు.
నవంబరు 6న భూమిక, 8న ప్రియాంకలు తమకు జ్వరం వచ్చిందని వసతిగృహంలో చెప్పి కమ్మాలకుంటతండాకు చేరుకున్నారు. నవంబర్ 22 వరకు వారు ఇంటి వద్ద ఉన్నారు. వసతిగృహానికి వెళ్తున్నామని తల్లిదండ్రులకు చెప్పి 23న ఇంటి నుంచి బయలు దేరారు. అదే రోజు రాత్రి ములుగు మండలం అడవిమల్లంపల్లిలో ఉన్న వారి బంధువు సోమ్లా ఇంటికెళ్లారు.

అక్కడి నుంచి తల్లిదండ్రులకు ఫోన్ చేసిన విద్యార్థినులు వసతిగృహానికి వెళ్లేసరికి ఆలస్యమవడంతో వార్డెన్ తమను రానివ్వలేదని, అందుకే బాబాయి ఇంటికొచ్చామని చెప్పారు. నవంబర్ 24న ఉదయం వసతిగృహానికి వెళుతున్నామని చెప్పి బాబాయి ఇంటి నుంచి వారు బయలుదేరారు.
కాగా, నవంబర్ 25న వార్డెన్.. ఆ విద్యార్థినులు వసతిగృహానికి రాలేదని వారి తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పారు. 27న వార్డెన్ మరోసారి ఫోన్ చేసి చెప్పడంతో ప్రియాంక, భూమికల తల్లిదండ్రులు ఆశ్రమ పాఠశాలకు వెళ్లి ఇద్దరూ నవంబరు 24న హాస్టల్‌కు వచ్చారని, మీరే ఏదో చేశారని వార్డెన్ వీరమ్మ, పనిమనిషి రాజమ్మలతో వాగ్వాదానికి దిగారు. వివాదం తీవ్రమవడంతో విద్యార్థినుల తల్లిదండ్రులపై వార్డెన్ నల్లబెల్లి పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
కాగా, తమ పిల్లలు నవంబరు 24 నుంచి కనిపించడం లేదని ప్రియాంక, భూమికల తల్లిదండ్రులు పర్వతగిరి పోలీసుస్టేషన్‌లో నవంబరు 28న ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కుళ్లిపోయిన మృతదేహాలు
చెన్నారావుపేట పోలీసుస్టేషన్‌కు సమీపంలో నిత్యం రద్దీగా ఉండే నర్సంపేట-నెక్కొండ ప్రధాన రహదారికి దగ్గరలోని గుట్టల్లో గిరిజన విద్యార్థినుల మృతదేహాలు లభ్యమయ్యాయి. కుక్కలు పీక్కు తినడంతో శరీర భాగాలు కుళ్లిపోయి చెల్లాచెదురయ్యాయి.
తీవ్ర దుర్గంధం రావడంతో స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. వరంగల్ రూరల్ ఎస్పీ అంబర్ కిశోర్‌ఝా గుట్టల్లోని మృతదేహాలను పరిశీలించారు. కాగా, ఘటనా స్థలంలో సినిమా టికెట్లు లభించడంతో ఎవరో హత్య చేసి.. పురుగులమందు డబ్బా అక్కడ ఉంచి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసివుంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. విద్యార్థినుల తల్లిదండ్రుల వాంగ్మూలం తీసుకొని పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications