సెప్టెంబర్ 17 - అమిత్ షా రాక ఖరారు : విమోచన వేడుకలు ఇలా - కిషన్ రెడ్డి..!!
కేంద్ర హోం మంత్రి అమిత్ షా రెండు రోజుల హైదరాబాద్ పర్యటన ఖరారైంది. ఈ నెల 16, 17 తేదీల్లో అమిత్ షా హైదరాబాద్ రానున్నారు. ప్రతీ ఏటా సెప్టెంబర్ 17న విమోచన - విలీన దినం అంటూ రాజకీయంగా చర్చలు జరిగేవి. విమర్శలు - ఆరోపణలు వినిపించేవి. కానీ, ఈ సారి కేంద్రం అధికారికంగా హైదరాబాద్ కేంద్రంగా విమోచన వేడుకలకు నిర్ణయించింది. ఇదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం సమైక్యత దినోత్సవ వేడుకలు నిర్వహించేందుకు నిర్ణయం తీసుకుంది. మూడు రోజుల పాటు ఈ వేడుకలు నిర్వహించాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయింది.

అధికారికంగా కేంద్రం ముందుకు
కేంద్రం హైదరాబాద్ లోని పెరేడ్ గ్రౌండ్స్ లో విమోచన వేడుకలను నిర్వహించేందుకు కార్యాచరణ ఖరారు చేసింది. దీనికి సంబంధించి కేంద్ర హోం మంత్రి అధికారిక హోదాలో ఈ వేడుకల్లో పాల్గొంటారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధికారికంగా వెల్లడించారు. పల్లెల్లో పోరాటాల స్ఫూర్తిగా నిర్మించిన బురుజులను అలంకరించి జాతీయ జెండాలను ఎగురవేయాలని పిలుపునిచ్చారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా సెప్టెంబర్17 ని ఘనంగా నిర్వహిస్తున్నట్లు కిషన్ రెడ్డి చెప్పుకొచ్చారు.

తెలంగాణ ప్రభుత్వం ప్రకటన
గత పాలకులు సెప్టెంబర్17 ప్రాముఖ్యత తెలియకుండా మరుగున పడేశారని కేంద్ర మంత్రి ఆరోపించారు. బిజేపీ నేతలపై కేసులు పెట్టారు తప్పా... హైదరాబాద్ విముక్తి ఉత్సవాలను ఏ ప్రభుత్వం నిర్వహించలేదని దుయ్యబట్టారు. ప్రజా కార్యక్రమంగా సెప్టెంబర్17న తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. నిజాం, రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడిన యోధులను స్మరించుకొని వారి కుటుంబాలను కలిసి సన్మానం చేస్తున్నామని కిషన్ రెడ్డి చెప్పుకొచ్చారు.

ఈ సారి సెప్టెంబర్ 17 ప్రత్యేకంగా
ఇప్పటికే ఎంఐఎం అధినేత ఓవైసీ సైతం పాతబస్తీలో తాము సమైక్యతా దినోత్సవం నిర్వహించేందుకు సిద్దమని ముందుకొచ్చారు. కేంద్రం సెప్టెంబర్ 17ను జాతీయ సమైక్యతా దినోత్సవంగా ప్రకటించాలని కేంద్ర హోం మంత్రి కిషన్ రెడ్డికి లేఖ రాసారు. ఇటు తెలంగాణ ప్రభుత్వం ప్రతీ గ్రామంలో జాతీయ జెండా ఆవిష్కరించాలని నిర్ణయించింది. అసెంబ్లీ సమావేశాల్లోనూ దీని పైన చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. బీజేపీ నేతలు మాత్రం తమ ఒత్తిడి ఫలితంగానే సెప్టెంబర్ 17న కార్యక్రమాల నిర్వహణకు అన్ని పార్టీలు ముందుకొచ్చాయని చెబుతోంది.












Click it and Unblock the Notifications