నో దూకుడు... రూటు మార్చిన కేంద్రమంత్రి బండి సంజయ్!
బిజెపి ఫైర్ బ్రాండ్ రూట్ మార్చారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ తన స్వభావానికి భిన్నంగా రాజకీయాలలో కొత్త ఒరవడి సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ఈ మేరకు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాలలో చర్చకు కారణంగా మారాయి.
రాజకీయ విమర్శలు చేయనన్న బండి సంజయ్
ప్రత్యర్థి పార్టీ ఏదైనా సరే తన మాటల దాడితో వారికి వెన్నులో వణుకు పుట్టించడంలో బండి సంజయ్ ది ప్రత్యేకమైన శైలి. అటువంటి బండి సంజయ్ కేంద్రమంత్రి అయిన తర్వాత ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ప్రత్యర్థి పార్టీల పైన రాజకీయ విమర్శలకు కూడా దూరంగా ఉంటున్నారు. ఇక ఇదే విషయాన్ని తాజాగా బండి సంజయ్ వెల్లడించారు. ఇప్పటినుంచి కరీంనగర్ లో రాజకీయ విమర్శలు చేయను అని ఆయన పేర్కొన్నారు.

కొత్తరాగం అందుకున్న కేంద్రమంత్రి బండి సంజయ్
రాజకీయాలలో పదవులు వస్తుంటాయి పోతుంటాయి కానీ చేసిన అభివృద్ధి మంచి పనులే శాశ్వతంగా నిలిచిపోతాయి అని బండి సంజయ్ వెల్లడించారు. జెండాలను, అజెండాలను పక్కనపెట్టి అభివృద్ధి చేయటానికి అన్ని పార్టీల నాయకులతో కలిసి పని చేస్తానని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కొత్త రాగం అందుకున్నారు. అభివృద్ధి కోసం అందరిని కలుపుకొని పోతానని బండి సంజయ్ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాలలో ఆసక్తికర చర్చకు కారణంగా మారింది.
కేంద్ర మంత్రి అయ్యాక బండి సంజయ్ లో మార్పు
నిన్న కరీంనగర్లో ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మేయర్ సునీల్ రావు తో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన బండి సంజయ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలలో పదవులు శాశ్వతం కాదని పేర్కొన్నారు. కేంద్ర మంత్రిగా ప్రస్తుతం బృహతమైన బాధ్యతలు నిర్వర్తిస్తున్న బండి సంజయ్ గతంలో మాదిరిగా ఎటువంటి రాజకీయ విమర్శలు చేయడం లేదు. మీడియాకు ప్రత్యేకంగా ఇంటర్వ్యూలు కూడా ఇవ్వడం లేదు.
బండి సంజయ్ నిర్ణయం పట్ల ఫ్యాన్స్ చర్చ
కేవలం అభివృద్ధిపైనే ఫోకస్ చేస్తూ ప్రజల దగ్గర మంచి పేరు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే రాజకీయాలలో ఈ స్థాయికి బండి సంజయ్ ఎదగడానికి ఆయన దూకుడు స్వభావమే కారణమని చాలామంది నేతలు భావిస్తున్నారు. అటువంటి బండి సంజయ్ దూకుడు తగ్గిస్తే, ప్రత్యర్థి పార్టీ అయినా సరే అభివృద్ధి కోసం కలిసి పని చేస్తానని చెబితే ఇది బండి సంజయ్ ఫ్యాన్స్ కు కొంత నచ్చని అంశమే. ఏది ఏమైనా సూటిగా, సుత్తి లేకుండా ప్రత్యర్థుల మీద విరుచుకు పడే బండి సంజయ్ ఇకపై అన్ని పార్టీల నాయకులను కలుపుకొని పనిచేస్తానని చెప్పడం ఆలోచించాల్సిన విషయమే.












Click it and Unblock the Notifications