తిరుమల లడ్డూ వివాదంపై సీఎం చంద్రబాబుకు కేంద్రమంత్రి బండి సంజయ్ సంచలన లేఖ!
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు వినియోగం ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారి, హిందువుల మనోభావాలను దెబ్బ తీసినట్టు భావిస్తున్న క్రమంలో ఈ వివాదంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఏపీ సీఎంకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఈ మేరకు లేఖ రాశారు.
హిందువుల మనోభావాలు కలచివేసిన ఘటన
శ్రీవారి భక్త కోటిని, యావత్ ప్రపంచంలోని హిందువుల మనోభావాలను తీవ్రంగా కలచివేసిన ఘటన ఇదని బండి సంజయ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. శ్రీవారి పవిత్రతను దెబ్బతీశారని, అన్యమత ప్రచారం జరుగుతోందని గతంలో ఫిర్యాదులు వచ్చినా గత పాలకులు పట్టించుకోలేదని బండి సంజయ్ ఈ లేఖలో పేర్కొన్నారు. ఎర్రచందనం కొల్లగొడుతూ ఏడు కొండలవాడిని, రెండు కొండలకే పరిమితం చేశారని చెప్పినా స్పందించలేదన్నారు.

హిందూ ధర్మంపై దాడికి భారీ కుట్ర
జంతువుల కొవ్వును లడ్డూ ప్రసాదంలో వినియోగించారని మీరు(చంద్రబాబు) చేసిన వ్యాఖ్యలతో లడ్డూ ప్రసాదంలో కల్తీ నిజమేనని యావత్ హిందూ సమాజం భావిస్తోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వును వినియోగించడం అత్యంత నీచమని, హిందూ ధర్మంపై దాడికి భారీ కుట్ర జరిగినట్లుగానే భావిస్తున్నాం అని ఆయన పేర్కొన్నారు.
టీటీడీలో కఠిన చట్టాలు తీసుకురండి
హిందూ ధార్మిక క్షేత్రంలో అన్యమత ప్రచారం కూడా పూర్తిగా నిషిద్ధం అని ఆయన అభిప్రాయం వ్యక్తంచేశారు. దేవుడిపై నమ్మకం లేని నాస్తికులకు, అన్యమతస్తులకు టీటీడీ పగ్గాలు అప్పగించడంవల్లే తిరుమల కొండపై అన్యమత ప్రచారానికి ఆస్కారం ఏర్పడుతోందని బండి సంజయ్ పేర్కొన్నారు. అన్యమతస్తులకు టీటీడీ పగ్గాలు అప్పగించకుండా, అన్యమతస్తులకు టీటీడీలో ఉద్యోగాలివ్వకుండా కఠినమైన చట్టాలు తీసుకురావాలని సూచించారు.
జగన్ సర్కార్ హయాంలో క్షమించరాని నేరం
తిరుమల కొండ పవిత్రతపై, లడ్డూ ప్రసాదాలపై ప్రజల్లో నెలకొన్న అనుమానాలను నివృత్తి చేయండి అంటూ బండి సంజయ్ తన లేఖలో పేర్కొన్నారు. లడ్డూ ప్రాముఖ్యతను తగ్గించడానికి, టీటీడీపై కోట్లాది మంది భక్తులకు ఉన్న విశ్వాసాన్ని సడలించేందుకు ఈ కుట్ర చేశారని పేర్కొన్న బండి సంజయ్ జగన్ సర్కార్ హయాంలో క్షమించరాని నేరానికి ఒడిగట్టారన్నారు.
సీబీఐతో విచారణ జరిపిస్తేనే నిజానిజాల నిగ్గు తేలుతుంది
అన్యమతస్తులకు టీటీడీ పగ్గాలు అప్పగించడం, అన్యమతస్తులకు ఉద్యోగాల్లో అవకాశం కల్పించడంవల్లే ఈ దుస్థితి వచ్చిందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఉన్నతస్థాయి వ్యక్తుల ప్రమేయం లేనిదే ఏళ్ల తరబడి ఈ కల్తీ దందా జరిగే అవకాశం లేదన్నారు. సీబీఐతో విచారణ జరిపిస్తేనే సమగ్ర దర్యాప్తు జరిగి వాస్తవాలు నిగ్గు తేలే అవకాశముందని బండి సంజయ్ తన అభిప్రాయంగా పేర్కొన్నారు.
అంతిమ నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానిదే.. కానీ
ఈ విషయంలో అంతిమ నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానిదే అని చంద్రబాబుకు ఆయన సూచించారు. రాజకీయ ప్రయోజనాలను పూర్తిగా పక్కనపెట్టి హిందువుల మనోభావాలను కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని బండి సంజయ్ అభిప్రాయపడ్డారు. తక్షణమే సమగ్ర విచారణ జరిపి దోషులపై కఠిన చర్యలు తీసుకోండి అంటూ బండి సంజయ్ సూచించారు.












Click it and Unblock the Notifications