తేల్చేశారు: చిన్నారిది నరబలే!, రాజశేఖరే నిందితుడు.. అదే పట్టించింది..
Recommended Video

హైదరాబాద్: ఉప్పల్ చిలుకానగర్ నరబలి కేసులో మిస్టరీ వీడిపోయింది. అసలు నిందితుడు రాజశేఖరే అని నిర్దారించారు. డీఎన్ఏ రిపోర్ట్ ఆధారంగా.. చిన్నారి రక్త నమూనాలను రాజశేఖర్ ఇంట్లో గుర్తించిన రక్తపు మరకలతో పోల్చి చూశారు. రెండు నమూనాలు ఒకటేనని తేలడంతో చిన్నారి హత్యకు నరబలే కారణమని పోలీసులు ధ్రువీకరించారు.
ఉప్పల్ నరబలి: డీఎన్ఏ రిపోర్ట్ వచ్చేసింది.., వాటితో మ్యాచ్ అయితే మరో మలుపు తిరిగినట్టే?

చిన్నారిది నరబలే..:
గ్రహణం రోజున నరబలి ఇస్తే భార్య ఆరోగ్యం మెరుగుపడుతుందన్న ఉద్దేశంతోనే నరబలి ఇచ్చినట్టుగా పోలీసులు ప్రాథమికంగా నిర్దారించారు. కేసు వెలుగులోకి వచ్చినప్పుడే.. ఇది నరబలి కేసు అని ప్రచారం జరిగినప్పటికీ.. నిందితుడు రాజశేఖర్ మాత్రం పోలీసులను తప్పుదోవ పట్టిస్తూ వచ్చాడు.

ఆ తల ఆడ శిశువుదే..:
డీఎన్ఏ రిపోర్ట్ ఆధారంగా హత్యకు గురైన చిన్నారిని ఆడ శిశువుగా నిర్దారించారు పోలీసులు. దాదాపు 20రోజుల దర్యాప్తులో ఎటువంటి క్లూ దొరక్కపోవడంతో తలపట్టుకున్న పోలీసులకు.. డీఎన్ఏ రిపోర్ట్ ఎట్టకేలకు మిస్టరీని చేధించడంలో ఉపయోగపడింది.

ఆ మరకలే పట్టించాయి..
ఎంతసేపూ రాజశేఖర్ తనకేమి తెలియదని బుకాయిస్తూ రావడంతో.. అతను నిజంగా అమాయకుడేనా? అని పోలీసులకు కూడా అనిపించింది. అయితే రాజశేఖర్ ఇంట్లో క్షుణ్ణంగా తనిఖీ చేసిన సమయంలో కంటికి కనిపించని రక్తపు మరకల నమూనాలను పోలీసులు సేకరించడం కేసుకు కీలకంగా మారింది.
ఈ రక్త నమూనాలను డీఎన్ఏ టెస్టుకు పంపించిన పోలీసులు.. చిన్నారి రక్త నమూనాలను అవి సరిపోయినట్టుగా నిర్దారించారు. దీంతో రాజశేఖర్ ఇంట్లోనే చిన్నారిని నరబలి ఇచ్చినట్టుగా తేలింది.

శిశువు శరీరాన్ని ఏం చేశారు?:
ఇప్పటివరకు చిన్నారి తల భాగం మాత్రమే లభ్యమైన నేపథ్యంలో.. మిగతా శరీర భాగాలను రాజశేఖర్ ఏం చేశాడన్నది ఇప్పుడు తేలాల్సి ఉంది. వాటిని ఎక్కడైనా పారేశారా? లేక పాతేశారా?.. అసలేం చేశారన్నది రాజశేఖర్ నోరు విప్పితేనే బయటకు వచ్చే అవకాశం ఉంది. దీంతో ఈ కేసులో మరిన్ని దారుణాలు వినడం ఖాయంగానే కనిపిస్తోంది

సాయంత్రం మీడియా సమావేశం:
కేసును చేధించిన నేపథ్యంలో పోలీసులు గురువారం సాయంత్రం మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ఈ సందర్భంగా విచారణకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించడంతో పాటు నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశముంది.