26 ఏళ్ల సర్వీసులో 20 బదిలీలు.. విమర్శలపై వీసీ సజ్జనార్ ఘాటు స్పందన!
తెలంగాణ అగ్నిమాపక, విపత్తు నిర్వహణ శాఖ డైరెక్టర్ జనరల్ గా సీనియర్ ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్ బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా పనిచేస్తున్న ఆయనను ఇటీవల ప్రభుత్వం బదిలీ చేసిన నేపథ్యంలో, నూతన బాధ్యతలు చేపట్టిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా తనపై జరుగుతున్న వ్యక్తిగత విమర్శలు, ఆరోపణలపై సజ్జనార్ సూటిగా స్పందించారు.
కొందరు వ్యక్తులు కేవలం తమ ఉనికిని చాటుకోవడానికి, సోషల్ మీడియాలో మైలేజ్ సంపాదించుకోవడానికే తన పేరు, ఫోటోలను వాడుకుంటూ ఆధారరహిత ప్రచారం చేస్తున్నారని సజ్జనార్ మండిపడ్డారు. ఇటీవల ఆయన బదిలీ నేపథ్యంలో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి మన్నెం నాగేశ్వరరావు 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా చేసిన తీవ్ర వ్యాఖ్యలపై సజ్జనార్ పరోక్షంగా బదులిచ్చారు. తాను ప్రస్తుతం సర్వీసులో ఉన్న అధికారినని, రోడ్డుపైకి వచ్చి వాదనలకు దిగే పరిస్థితి ఉండదని స్పష్టం చేశారు.

నిరాధార ఆరోపణలకు కాలమే సరైన సమాధానం చెబుతుందని, సమయం వచ్చినప్పుడు చట్టం తన పని తాను చేసుకుపోతుందని హెచ్చరించారు. తన వృత్తి జీవితంలోని అనుభవాలను గుర్తుచేసుకుంటూ, 26 ఏళ్ల సర్వీసులో ఇప్పటివరకు 20 పోస్టింగ్‌లు చూశానని సజ్జనార్ తెలిపారు. తాను ఏం చేశానో, తన నిబద్ధత ఏమిటో తెలంగాణ ప్రజలందరికీ తెలుసన్నారు. ప్రభుత్వం ఏ విభాగంలో బాధ్యతలు అప్పగించినా అదే అంకితభావంతో పనిచేస్తానని, పోస్టింగ్ ఏదైనా వెనకడుగు వేసే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.
కొత్త శాఖలో తన ప్రాధాన్యతలను వివరిస్తూ, రాష్ట్రవ్యాప్తంగా అగ్నిప్రమాదాల నివారణ మరియు అత్యవసర స్పందన సమయాన్ని మరింత మెరుగుపరచడంపై దృష్టి సారిస్తానని తెలిపారు. హైదరాబాద్ సహా ఇతర పట్టణాల్లో వేగంగా విస్తరిస్తున్న బహుళ అంతస్తుల భవనాలు, పరిశ్రమలలో లోతైన ఫైర్ సేఫ్టీ ఆడిట్ నిర్వహిస్తామని చెప్పారు. ముఖ్యంగా పాత భవనాలు, పాఠశాలలు, ఆసుపత్రులు, హాస్టళ్లలో అగ్నిమాపక నిబంధనలు తూచా తప్పకుండా అమలయ్యేలా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
శాఖాపరమైన సంస్కరణలలో భాగంగా ఫైర్, ఎస్‌పీఎఫ్ విభాగాల్లో పనిచేస్తున్న సుమారు 5 వేల మంది సిబ్బంది ఆరోగ్య పరిరక్షణ కోసం 'గ్రాండ్ హెల్త్ ఛాలెంజ్' అమలు చేయనున్నట్లు ప్రకటించారు. అలాగే ఏదైనా అగ్నిప్రమాదం జరిగినప్పుడు ఫైర్ ఇంజిన్లు చేరుకునేలోపే స్థానికులు ప్రాథమిక చర్యలు తీసుకునేలా 'ఫస్ట్ రెస్పాండర్' వ్యవస్థను అందుబాటులోకి తెస్తామని వివరించారు.
గత ఏడాది కాలంలో తెలంగాణ అగ్నిమాపక శాఖ సిబ్బంది సమయస్ఫూర్తితో వ్యవహరించి 214 మంది ప్రాణాలను కాపాడటంతో పాటు, సుమారు రూ.700 కోట్ల విలువైన ఆస్తులను అగ్నికీలల నుంచి రక్షించారని సజ్జనార్ వెల్లడించారు. నగరాల్లో నివాస సముదాయాలు, వాణిజ్య భవనాల సంఖ్య పెరుగుతున్న తరుణంలో అగ్నిమాపక శాఖ పాత్ర మరింత కీలకంగా మారిందన్నారు. కేవలం ప్రమాదం జరిగిన తర్వాత స్పందించడమే కాకుండా, ముందస్తు తనిఖీలు, ప్రజల్లో అవగాహన పెంచడం ద్వారా భారీ ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించవచ్చన్నారు.












Click it and Unblock the Notifications
