విభజన బిల్లుపై ఉండవల్లి పుస్తకం: సోనియాను అవమానించొద్దని విహెచ్ ఫైర్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు పైన చర్చ జరగాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ పుస్తకం ఇవ్వడంపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేత వీ హనుమంత రావు శుక్రవారం భగ్గుమన్నారు.
ఉండవల్లి తీరు సరికాదన్నారు. విభజనపై మరోసారి చర్చ జరగాలని రాష్ట్రపతికి ఉండవల్లి పుస్తకం ఇవ్వడం కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని అవమానించడమే అన్నారు. సోనియా గాంధీని అవమానించడం ఉండవల్లికి తగదన్నారు.
విభజన సమయంలో రాష్ట్రపతి బిల్లును ఆంధ్రప్రదేశ్ శాసన సభకు పంపించారని, అప్పుడు చర్చించకుండా తిరస్కరించారని గుర్తు చేశారు. అసెంబ్లీలోనే చర్చ జరగనప్పుడు అది తప్పు అనే హక్కు ఎవరికీ లేదన్నారు. కులం పేరుతో ప్రజలను రెచ్చగొడుతున్న హార్దిక్ పటేల్‌ను అరెస్టు చేయాలన్నారు.

కాగా... రాజ్యాంగం, పార్లమెంట్ నియమ నిబంధనలకు లోబడి ఏపీ పునర్విభజన చట్టం ఉభయ సభల ఆమోదం పొందిందా? లేదా? అన్న విషయమై సమగ్రమంగా ఆరా తీసి జరిగిన నష్టాన్ని సరిదిద్దాలని మాజీ ఉండవల్లి రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీకి రెండు రోజుల క్రితం విజ్ఞప్తి చేశారు.
2014 ఫిబ్రవరి 18న ఈ బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందిన తీరును కూలంకషంగా పరిశీలిస్తే బిల్లు చట్టసభల అనుమతి పొందలేదని తెలుస్తుందని, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థగా గుర్తింపు పొందిన మన దేశ రాజ్యాంగం, పార్లమెంటరీ వ్యవస్థ సిగ్గుతో తలదించుకునే రీతిలో ఈ బిల్లు ఆమోదం పొందిందన్నారు.
రాజ్యాంగ పరిరక్షకుడిగా రాష్టప్రతి తగిన చర్యలు తీసుకోని పక్షంలో భవిష్యత్తులో చట్టసభల అధిపతులు సభ తలుపులు మూసివేసి సభ్యుల ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా తమకు తోచినట్లు వ్యవహరించే ప్రమాదం ఉందని అరుణ్ కుమార్ అభిప్రాయపడ్డారు.
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టాన్ని పార్లమెంట్ ఉభయ సభలు, రాజ్యాంగం నియమ నిబంధనలకు విరుద్ధంగా ఆమోదించినట్లు సాక్ష్యాధారాలతో రుజువు చేసే ఒక పుస్తకాన్ని ఉండవల్లి రూపొందించారు. లోకసభ సచివాలయం తయారుచేసిన నివేదికలను అధ్యయనం చేసి రూపొందించిన ఈ పుస్తకాన్ని ఆయన రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీకి అందచేయడంతో పాటు నాలుగు పేజీల వినతి పత్రం కూడా అందచేశారు.












Click it and Unblock the Notifications