వీఆర్ఏలకు గుడ్‌న్యూస్: ఇక వారంతా ప్రభుత్వ ఉద్యోగులే, జీవో అందించిన సీఎం కేసీఆర్
హైదరాబాద్: సుదీర్ఘ కాలంగా పోరాటం చేస్తున్న వీఆర్ఏలకు కేసీఆర్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. తాతల, తండ్రుల కాలం నుంచి తరతరాలుగా గ్రామాల్లో సహాయకులుగా పనిచేస్తున్న వీఆర్ఏ లకు 'పే స్కేలు' అమలు పరుస్తూ, వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా పర్మినెంట్ చేస్తూ ఆదివారం నాడు ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు(KCR) సోమవారం సచివాలయంలో జీవో కాపీని వీఆర్ఏ(VRA) జేఏసీ నేతలకు అందజేశారు.
భూస్వామ్య వ్యవస్థకు చిహ్నంగా మిగిలిన వీఆర్‌ఏ వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. ప్రస్తుతం వీఆర్‌ఏలుగా పనిచేస్తున్న అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాలని నిర్ణయించింది. ఈ మేరకు సీఎం కేసీఆర్ ప్రకటించినట్టుగానే రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న 20,555 మంది వీఆర్‌ఏలను సూపర్ న్యూమరరీ పోస్టుల్లో క్రమబద్ధీకరించనున్నారు. సీఎం ఆదేశాల మేరకు సీఎస్ శాంతికుమారి సోమవారం వీఆర్‌ఏల క్రమబద్ధీకరణకు సంబంధించిన ఉత్తర్వులను విడుదల చేశారు.

రాష్ట్రంలో వీఆర్‌ఏల క్రమబద్ధీకరణ, సర్దుబాటు, స్థిరీకరణ అంశాలపై ఆదివారం రాష్ట్ర సచివాలయంలో సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. నీరటి, మసూరు, లషర్ వంటి కాలం చెల్లిన పేర్లతో పిలుచుకుంటున్న, భూస్వామ్య వ్యవస్థకు చిహ్నాలుగా మిగిలిన వీఆర్‌ఏ వ్యవస్థను శాశ్వతంగా రద్దు చేస్తూ ఈ సమావేశంలో చారిత్రక నిర్ణయం తీసుకున్నారు. అందుకు సంబంధించిన ఉత్తర్వులను సోమవారం విడుదల చేశారు. ఈ ఉత్తర్వుల కాపీని వీఆర్‌ఏల జేఏసీ నేతలకు అందజేశారు. దీంతో రాష్ట్రంలోని వీఆర్‌ఏలు అంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు చెబుతున్నారు.
మంత్రుల సబ్ కమిటీ సిఫారసుల మేరకు, నిబంధనలను అనుసరించి వీఆర్ఏల అర్హతలను ప్రకారం, మున్సిపాలిటీ, మిషన్ భగీరథ, ఇరిగేషన్ తదితర శాఖల్లో సర్దుబాటు చేస్తూ వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా పర్మినెంట్ చేస్తున్నామని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తెలిపారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను సోమవారం నాడు విడుదల చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిని సీఎం ఆదేశించిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications