ఓరుగల్లుకు మహర్దశ.. రూ.382 కోట్ల అంచనా వ్యయంతో ఐదు కీలక ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్!
హైదరాబాద్ తర్వాత వరంగల్ నగరాన్ని అభివృద్ధికి బాటలు పడుతున్నాయి. నగర అభివృద్ధికి రూ.382 కోట్ల అంచనా వ్యయంతో ఐదు కీలక ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది.ఈ మెగా ప్రాజెక్టులను కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో చేపట్టనున్నారు.
ప్రపంచ బ్యాంకు ఆర్థిక సహాయంతో కేంద్రం అమలు చేస్తున్న 'అర్బన్ ఛాలెంజ్ ఫండ్' కింద ఈ నిధులు సమకూరాయి. తెలంగాణ అర్బన్ ట్రాన్స్‌ఫర్మేషన్ అండ్ జాబ్స్ ప్రోగ్రామ్‌లో భాగంగా ఈ పనులు జరగనున్నాయి. మున్సిపల్ పరిపాలన శాఖ కార్యదర్శి డాక్టర్ టి.కె. శ్రీదేవి గురువారం జీవో నెంబర్ 957 ద్వారా అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.

కుడా ఆధ్వర్యంలో వరంగల్ కోట కందకాల పునరుద్ధరణ, హనుమకొండ సెంట్రల్ ప్లాజా అభివృద్ధి, ఇంటిగ్రేటెడ్ బస్ టెర్మినల్ కమ్ కమర్షియల్ కాంప్లెక్స్, వేయి స్తంభాల గుడి పరిసరాల్లో అభివృద్ధి పనులు, మ్యూజికల్ గార్డెన్ ఏర్పాటు వంటి ప్రాజెక్టులు నగరానికి కొత్త రూపురేఖలను తీసుకురావటానికి ఈ నిధులను ఉపయోగించకున్నారు. .వీటితో పర్యాటక రంగం అభివృద్ధి చెందడమే కాకుండా, వాణిజ్య కార్యకలాపాలు, స్థానిక ఉపాధి అవకాశాలకు మరింత ఊతం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
వరంగల్ ఖిల్లా అభివృద్ధి రూ.209 కోట్లు, హనుమకొండ సెంట్రల్ ప్లాజా పునర్నిర్మాణం: రూ.19 కోట్లు, ఇంటిగ్రేటెడ్ బస్ టెర్మినల్ కమ్ కమర్షియల్ కాంప్లెక్స్: రూ.125 కోట్లు, వేయి స్తంభాల గుడి పరిసరాల అభివృద్ధి: రూ.20 కోట్లు, మ్యూజికల్ గార్డెన్ ఏర్పాటు: రూ.9 కోట్లు, ఖిల్లా పునరుద్ధరణకు సంబంధించి ఇప్పటికే పురాతత్వ సర్వే సంస్థ (ASI)తో అవగాహన ఒప్పందం కుదిరింది.
బస్ టెర్మినల్ నిర్మాణానికి అదనంగా మరో రూ.50 కోట్లు మంజూరు చేయాలని కూడా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు.ఈ ప్రాజెక్టులు పూర్తయితే పర్యాటక రంగం మరింత వికసిస్తుందని, వాణిజ్య కార్యకలాపాలు పెరుగుతాయని, స్థానిక ఉపాధి అవకాశాలు భారీగా లభిస్తాయని సుధారాణి ఆశాభావం వ్యక్తం చేశారు. వరంగల్ నగరాభివృద్ధికి కృషి చేయటం పట్ల కుడా చైర్‌పర్సన్ గుండు సుధారాణి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి కుడా, వరంగల్ ప్రజల తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ అభివృద్ధి ప్రాజెక్టుల నిధుల మంజూరికి సహకరించిన ఇన్‌చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి, రాజ్యసభ ఎంపీ వేం నరేందర్ రెడ్డికి, వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్యకు, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి కి, కుడా వైస్ చైర్‌పర్సన్‌కు, వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఐఏఎస్ గారికి గుండు సుధారాణి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో కృషి చేయడం వల్ల నగర అభివృద్ధి లక్ష్యాలను మరింత వేగంగా సాధించగలమని పేర్కొన్నారు.
వరంగల్ అభివృద్ధిపై ముఖ్యమంత్రి రేవంత్ చూపుతున్న ప్రత్యేక చొరవ నగర ప్రజల్లో కొత్త ఆశలను నింపుతోందని, నగరానికి ఇచ్చిన హామీకి అనుగుణంగా కీలక ప్రాజెక్టులకు అనుమతులు మంజూరు చేయడం అభివృద్ధిలో కీలక అడుగు అని అభిప్రాయం వ్యక్తం చేశారు.













Click it and Unblock the Notifications
