తెలంగాణలో బీజేపీ డబుల్: అధికారం పక్కా అంటూ జేపీ నడ్డా కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో జరుగుతున్న బీజేపీ జాతీయ సమావేశాల్లో ఆపార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈసారి తెలంగాణలో అధికారంలోకి వస్తామన్నారు. కొన్నిసార్లు ఓటమిలోకూడా గెలుపు ఉంటుందని వ్యాఖ్యానించారు. తెలంగాణలో ఆ మేరకు విజయం సాధించామని చెప్పుకొచ్చారు.
గతంలో తెలంగాణలో బీజేపీ ఒక శాసనసభ్యుడే ఉన్నాడని.. అప్పుడు బీజేపీకి ఓటు శాతం 7.1 శాతంగా ఉందన్నారు. అయితే, ఇప్పుడు అది రెట్టింపై 14 శాతానికి పెరిగి 8 మంది శాసనసభ్యులు గెలుపొందారని జేపీ నడ్డా పేర్కొన్నారు. తెలంగాణలో ఈసారి వదిలిపెట్టేది లేదన్నారు. తెలంగాణలో ఈసారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామన్నారు. ఇందుకు సన్నద్ధమవుతున్నామన్నారు.

ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వానికి ప్రజలు మద్దతివ్వడం వల్లనే అన్ని రాష్ట్రాల్లో ఇంతటి గొప్ప ఫలితాలు రావడానికి కారణమని జేపీ నడ్డా తెలిపారు. ఇక, క్షేత్రస్థాయిలో కార్యకర్తలంతా ఎంతో శ్రమించి బీజేపీకి ఓట్లు వచ్చేలా కృషి చేశారని, శ్రమించి పనిచేసిన కార్యకర్తలందరికీ అభినందనలు తెలిపారు. 2014లో కేవలం ఐదు రాష్ట్రాల్లో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం.. ఇప్పుడు 17 రాష్ట్రాల్లో పరిపాలన సాగిస్తోందన్నారు. గుజరాత్ రాష్ట్రంలో రెండు దశాబ్దాలకుపైగా బీజేపీ పాలిస్తోందన్నారు. బెంగాల్‌లోనూ సింగిల్ డిజిట్ నుంచి 77 సీట్లకు ఎదిగామన్నారు.
దేశంలో మూడోసారి మోడీ నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామని జేపీ నడ్డా ధీమా వ్యక్తం చేశారు. ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాల్లో ఐదేళ్లకోసారి ప్రభుత్వం మారేదని.. ఆ సంప్రదాయాన్ని కాదని.. ఉత్తరాఖండ్ ప్రజలు బీజేపీ ప్రభుత్వాన్ని కొనసాగిస్తున్నారన్నారు. మనదేశ రాజకీయ స్థితిగతులను మోడీ మార్చివేశారన్నారు. గరీబ్, యువ, రైతు, మహిళా శక్తిని దృష్టిలో ఉంచుకుని మోడీ నాయకత్వంలో బీజేపీ ముందుకు సాగుతోందన్నారు.












Click it and Unblock the Notifications