మూసీ ప్రాజెక్టుపై తేల్చేసిన రేవంత్: ప్రతిపక్షాలకు సూటి ప్రశ్న, ఈటలపై సెటైర్
హైదరాబాద్: మూసీ రివర్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టుపై ముందుకే వెళతామన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. మూసీ నది ప్రక్షాళన చేయాలనుకుంటున్నామని.. ఎవరు అడ్డుపడినా ప్రాజెక్టు ఆగదని స్పష్టం చేశారు. మురికిలో కూరుకుపోయిన మూసీ నదిని ఎందుకు అభివృద్ధి చేసుకోకూడదని ప్రశ్నించారు. మూసీ బాధితులంతా మురికిలోనే బతకాలా? వాళ్ల జీవితాలు బాగుపడొద్దా? అని సీఎం రేవంత్ నిలదీశారు.
33 బృందాలతో మూసీ ఏరియాలో అధికారులు సర్వే చేశారని.. నిర్వాసితులను ఒప్పించే ఖాళీ చేయిస్తున్నారని సీఎం రేవంత్ తెలిపారు. విలువైన మూసీ ప్రక్షాళన ప్రాజెక్టుపై సలహాలు ఇవ్వకుండా.. విమర్శలు చేయడం ఏంటని ప్రతిపక్షాలపై మండిపడ్డారు. 20 ఏళ్లుగా తాను రాజకీయాల్లో ఉన్నానని.. తనకు పేదోడి బాధ తెలియదా? అని ప్రశ్నించారు.

గత ప్రభుత్వం రూ. 7 లక్షల కోట్లు అప్పు చేసిందని.. మరో రూ. 10 వేల కోట్లు అప్పు చేసి మూసీ బాధితులను ఆదుకోలేమా? అని రేవంత్ నిలదీశారు. తప్పకుండా మూసీ మంచి చోట ఆశ్రయం కల్పిస్తామని సీఎం హామీ ఇచ్చారు. మీరు చేసిన అవినీతిని ఆపితే పేదలను ఆదుకోవచ్చని బీఆర్ఎస్‌పై మండిపడ్డారు.
ఎంపీ ఈటల రాజేందర్ చొక్కా మార్చాడు కానీ.. ఇంకా పాత అంగీ వాసన పోలేదన్నారు రేవంత్. బీఆర్ఎస్ అడుగుజాడల్లోనే ఇంకా ఈటల నడుస్తున్నారని విమర్శించారు. ప్రజలు నిరాశ్రయులు అవుతారని ప్రాజెక్టులు కట్టకుండా ఉంటారా? అని ప్రశ్నించారు. గత ప్రభుత్వం నిర్మించిన మల్లన్నసాగర్, కొండపోచమ్మ, గంధమల్ల రిజర్వాయర్లలో ఎవరి భూములు పోలేదా? అని రేవంత్ నిలదీశారు. మల్లన్న సాగర్ కింద రైతులను కొట్టి, బలవంతంగా ఖాళీ చేయించారన్నారు.
మూసీ నిర్వాసితులను రెచ్చగొడుతున్న కేసీఆర్ కుటుంబం వాళ్ల కోసం ఏమైనా చేసిందా? అని సీఎం రేవంత్ ప్రశ్నించారు. పేదలను రెచ్చగొట్టకుండా.. మూసీ నిర్వాసితులను ఎలా ఆదుకుందామా అని సలహాలు ఇవ్వాలని సీఎం రేవంత్ ప్రతిపక్షాలకు హితవు పలికారు.
మరోవైపు, కేసీఆర్‌పై విమర్శలు ఎక్కుపెట్టారు రేవంత్. కాళేశ్వరం కేసీఆరే కట్టారు..ఆయన కళ్ల ముందే కూలిందన్నారు. కాళేశ్వరానికి ఇప్పటి వరకు డీపీఆర్ లేదన్నారు. లక్షా 50 వేల కోట్ల అంచనాతో ప్రాజెక్టు కట్టారన్నారు. మల్లన్నసాగర్ లో 50 టీఎంసీలు నింపితే కూలిపోతుందని..నిపుణుల కమిటీ తేల్చిందని సీఎం రేవంత్ తెలిపారు.












Click it and Unblock the Notifications