బాబు పిలిస్తే అమరావతికి వెళ్తాం, పంచాయతీ లేదు: కెటిఆర్, చూస్తానని కేజ్రీవాల్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి శంకుస్థాపన వేడుకకు ఆహ్వానం వస్తే తాము వెళ్తామని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు బుధవారం నాడు చెప్పారు. ఏపీ సీఎం నారా చంద్రబాబు స్వయంగా కెసిఆర్ ఇంటికెళ్లి ఆహ్వానిస్తానని చెప్పిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో అమరావతికి ఆహ్వానం వస్తే వెళ్తామని మంత్రి కెటిఆర్ చెప్పారు. అయితే, ముఖ్యమంత్రి కెసిఆర్ వెళ్తారా లేక మంత్రులు వెళ్తారా అనేది తెలియాల్సి ఉంది. బుధవారం మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ... ఏపీ ప్రజలతో తమకు ఎలాంటి పంచాయతీ లేదన్నారు.
హైదరాబాదులో ఉన్న ఏపీ ప్రజలతోను ఎలాంటి పంచాయతీ లేదని చెప్పారు. విశాఖలో హుధుద్ తుఫాను వచ్చినప్పుడు తాము రూ.18 కోట్లతో విద్యుత్ పరికరాలు ఇచ్చామని కెటిఆర్ ఈ సందర్భంగా చెప్పారు.

తెలంగాణ ఏర్పాటు వల్ల ఆంధ్రా ప్రజలకు మేలు జరిగిందన్నారు. తెలుగు జాతి అభివృద్ధి కోసం రెండు రాష్ట్రాలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ఎక్కడున్నా తెలుగు జాతి ఖ్యాతిని ఇనుమడింప చేయాలనేదే తమ అభిమతం అని చెప్పారు.
అమరావతి వచ్చేందుకు ప్రయత్నిస్తా: కేజ్రీవాల్
ఆంధ్రప్రదేశ్ రాజధాని శంకుస్థాపనకు వచ్చేందుకు తాను ప్రయత్నిస్తానని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దేశ రాజధానిలో చెప్పారు.
ఢిల్లీలోని ఏపీ భవన్‌లో ఏపీ సీఎం చంద్రబాబుతో ఆయన భేటీ అయ్యారు. అమరావతి శంకుస్థాపనకు రావాల్సిందిగా చంద్రబాబు తనను ఆహ్వానించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా స్వచ్ఛ భారత్‌పై నీతి ఆయోగ్ ఉపసంఘం రూపొందించిన నివేదికను ఆయన పరిశీలించి పూర్తి మద్దతు తెలిపారు.












Click it and Unblock the Notifications