తెలంగాణలో భానుడి ప్రతాపం: 29 వరకు ప్రజలకు అలర్ట్, ఏడుగురు మృతి
హైదరాబాద్: తెలంగాణలో రోజురోజుకూ ఎండలు మండిపోతున్నాయి. తీవ్రమైన ఎండలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు తప్పడంలేదు. ఉదయం 9 తర్వాత బయటికి రావాలంటే జనం జంకుతున్నారు. మరోవైపు, సాయంత్రం 6 గంటల వరకు కూడా రాష్ట్రంలో వడగాలులు వీస్తున్నాయి. దీంతో పిల్లలు, వృద్ధులు ఎండవేళల్లో బయటికి రావొద్దంటూ వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు.
మరోవైపు, మే 29 వరకు ఈ ఎండలు దంచి కొడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. బుధవారం సుమారు అన్ని ప్రాంతాల్లోనూ ఉదయం సమయంలో ఉష్ణోగ్రత 40 నుంచి 46 డిగ్రీల మధ్య నమోదయింది. అన్ని ప్రాంతాలకంటే అధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడులో ఏకంగా 46.4 ఉష్ణోగ్రత నమోదైంది.

బయ్యారంలో 45.3 డిగ్రీలు, సూర్యాపేట జిల్లా మామిళ్ల గుడెంలో 45.2 డిగ్రీలు, నల్గొండ జిల్లాలోని నిడమనూరులో 45.2 డిగ్రీలు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మహాదేవపూర్‌లో 44.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మరోవైపు, రాష్ట్రంలో మంగళవారం పగటిపూట అత్యధికంగా ఉష్ణోగ్రత 45.2 డిగ్రీలుండగా.. తరువాత రోజు 1.2 డిగ్రీలు పెరగటం గమనార్హం. అధిక ఉష్ణోగ్రత కారణంగా రాష్ట్రంలో వేర్వేరు చోట్ల ఏడుగురు మృతి చెందారు.
గురువారం పలు ప్రాంతాల్లో 43 డిగ్రీల నుంచి 44 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు జారీ చేసింది. ఉదయం నుంచి ఎండల ప్రభావం వల్ల రాత్రిపూట కూడా వేడిగా ఉండటంతో ప్రజలు ఉక్కపోతతో ఇబ్బందులు తీవ్ర పడుతున్నారు. మంగళవారం హనుమకొండలో 31 డిగ్రీలు, ఖమ్మంలో 30 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ ప్రాంతాల్లో సాధారణంగా కంటే 3.6 డిగ్రీలు అధికంగా నమోదు కావడం గమనార్హం.
ఇది ఇలావుండగా, సముద్రాల మీద వేడి అధికంగా ఉంటున్న కారణగా భూమధ్య రేఖ ప్రాంతాల్లో నైరుతి రుతు పవనాలకు అనువైన వాతావరణ పరిస్థితులు కనిపించడం లేదని వాతావరణ శాఖ రాష్ట్ర సంచాలకురాలు నాగరత్న తెలిపారు. మే 29వ తేదీ వరకు ఇలానే ఎండలు కొనసాగే అవకాశాలున్నాయన్నారు. ప్రజలు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు బయట తిరగవద్దని నాగరత్న సూచించారు. రుతుపవనాలకు అనుకూలంగా వాతావరణాలు ఏర్పడితే జూన్ మొదటి వారంలో కేరళ రాష్ట్రంలో వర్షాలు ప్రారంభమవుతాయని తెలిపారు.












Click it and Unblock the Notifications