తెలంగాణ వెదర్ అలర్ట్: వచ్చే ఐదు రోజులపాటు అత్యధిక ఉష్ణోగ్రతలు, తీవ్ర వడగాలులు
హైదరాబాద్: రాజధాని నగరం హైదరాబాద్‌తోపాటు పలు చోట్ల తేలికపాటి వర్షాలు కురుస్తున్నప్పటికీ.. పగటిపూట మాత్రం ఎండలు మండిపోతున్నాయి. హైదరాబాద్ నగరంలో కొంత వాతావరణం చల్లగా ఉంటున్నప్పటికీ.. ఇతర జిల్లాల్లో మాత్రం ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదవుతున్నాయి. వడగాలుల తీవ్రత కూడా ఎక్కువగా ఉండటంతో ఉదయం నుంచి సాయంత్రం మధ్యలో ప్రజలు బయటికి రావాలంటేనే జంకుతున్నారు. అయితే, మరికొన్ని రోజులపాటు ఎండ తీవ్రత ఎక్కువగానే ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.
మంగళవారంనాడు రెండు చోట్ల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌లో ఏకంగా 45.7 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు కాగా.. కొమురంభీం జిల్లా జంబుగలో 45.4 డిగ్రీలు రికార్డైంది. ఇక, రాగల ఐదు రోజులు రాష్ట్రంలో అక్కడక్కడ వడగాలులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

బుధవారం నుంచి మహబూబాబాద్, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం నల్లగొండ జిల్లాలతోపాటు ఉత్తర తెలంగాణల్లోని మరో మూడు నాలుగు జిల్లాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశముందని హెచ్చరించింది. ఈ ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు 41 డిగ్రీల నుంచి 43 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. హైదరాబాద్ దాని చుట్టు పక్కల జిల్లాల్లో 39 డిగ్రీల నుంచి 41 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది.
కాగా, సోమవారం నాటి ఆవర్తనం మంగళవారం దక్షిణ చత్తీస్‌గడ్ దాని పరిసర ప్రాంతాలలో కొనసాగుతూ.. సగటు సముద్ర మట్టం నుంచి 1.5 కిలోమీటర్ల ఎత్తు వద్ద స్థిరంగా ఉంది. ద్రోణి విదర్భ నుంచి తెలంగాణ మీదుగా ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక వరకు సగటు సముద్ర మట్టం నుంచి 0.9 కిలోమీటర్ల వద్ద కొనసాగుతోంది. మరోవైపు రాష్ట్రంలో రాగల మూడు రోజులు అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక రుతుపవనాలు కూడా కొంత ఆలస్యంగానే వస్తాయని పేర్కొంది.












Click it and Unblock the Notifications