కులగణన సర్వేలో అలాంటి ప్రశ్నలెందుకు?: రేవంత్ సర్కారుపై డీకే అరుణ ఫైర్
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ కులగణన సర్వే విషయంలో కాంగ్రెస్ సర్కారుపై బీజేపీ ఎంపీ డీకే అరుణ విమర్శలు గుప్పించారు. సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ద్వారా కుల, జనగణన చేస్తామని ప్రభుత్వం చెబుతోందని.. అయితే, కులగణనకు విరుద్ధంగా ప్రశ్నావళి ఉందని డీకే అరుణ ఆరోపించారు.
ఆస్తులు, అప్పులు, భూములు, ఏ పార్టీ అని అడుగుతున్నారు.. వ్యక్తిగత ఆస్తుల వివరాలు ప్రభుత్వానికి ఎందుకని డీకే అరుణ ప్రశ్నించారు. ఈ సర్వే దేనికోసమో స్పష్టం చేయాలన్నారు. బీసీ వర్గాలను మోసం చేయడానికే ఈ సర్వే అని విమర్శించారు. ఇచ్చిన హామీల నుంచి తప్పించుకోవడానికే ఈ సర్వే అని ధ్వజమెత్తారు.

కులగణన పేరుతో ప్రజలను పక్కదారి పట్టించడం మోసం చేయడమేనని డీకే అరుణ అన్నారు. బీసీల అభివృద్ధి మీద చిత్తశుద్ధి లేదు.. రాజకీయంగా మోసం చేస్తున్నారని విమర్శించారు. ప్రజలు ఇచ్చిన వివరాలు మాత్రమే స్వీకరించాలి. బలవంతంగా వివరాలు స్వీకరిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల స్వేచ్ఛను హరిస్తుందన్నారు. 60 ఏళ్లు పాలించిన కాంగ్రెస్.. ఎందుకు కులగణన చేయలేదని ప్రశ్నించారు.
ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇచ్చే ఇళ్లకు ఇందిరమ్మ పేరు పెట్టడం సమంజసమా? అని డీకే అరుణ ప్రశ్నించారు. ఎన్నికల్లో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిందని కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. కేసీఆర్ కాళేశ్వరం పేరుతో దోచుకుంటే.. రేవంత్ రెడ్డి మూసీ ప్రక్షాళన పేరుతో దోచుకోవడానికి చూస్తున్నారని ఆరోపించారు. మూసీ ప్రక్షాళనకు బీజేపీ వ్యతిరేకం కాదని.. లక్షన్నర కోట్ల దోపిడీకి మాత్రమే వ్యతిరేకమని డీకే అరుణ అన్నారు. డ్రైనేజీ వెళ్లకుండా ముందు మూసీ చుట్టూ రీటైనింగ్ వాల్ కట్టాలని సూచించారు.
ఎల్లుండి నుంచి సమగ్ర కుటుంబ సర్వే
తెలంగాణ వ్యాప్తంగా సమగ్ర కుటుంబ సర్వేలో తొలి దశ బుధవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రంలో మొదటి రోజు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికార కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. ఈ ప్రక్రియను నవంబర్ 9న ప్రారంభించి నెలాఖరులోగా పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మొదటగా ఇంటి నంబరు, అందులో నివసించే యజమాని పేరు నమోదు చేసే ప్రక్రియ సాగింది.
ఇందులో ఒక్కో గణకుడికి 150 నుంచి 175 ఇళ్ల దాకా కేటాయించగా, వారు శుక్రవారం వరకు ఆ వివరాలను నమోదు చేస్తారు. రాష్ట్రంలో మొత్తం ఎన్ని ఇళ్లు ఉన్నాయో, వాటిలో ఎన్ని కుటుంబాలు నివాసం ఉంటున్నాయో అనే జాబితా సిద్ధమవుతుంది. అప్పుడు ఆ వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తారు. ఈ సమాచారం ఆధారంగా ప్రతి ఇంటికి వెళ్లి కుటుంబంలోని సభ్యులందరి
సమగ్ర వివరాలు సేకరించి నమోదు చేసుకుంటారు.












Click it and Unblock the Notifications