భార్యాభర్తల అనుబంధానికి అర్ధం చెప్పే కథ.. భర్త కోసం ఓ భార్య ఏం చేసిందంటే!
భార్యలను భర్తలు, భర్తలను భార్యలు దారుణంగా హతమారుస్తున్న నేటి రోజుల్లో ఒక జంట భార్యా భర్తల అనుబంధానికి అర్ధం చెప్తున్నారు. తాజాగా ఖమ్మం జిల్లా వైరాలో జరిగిన ఈ ఘటన భార్యా భర్తల బంధానికి ప్రతీకగా నిలిచింది. భర్త పడుతున్న కష్టాలను చూసి ఓ ఇల్లాలు మనసు కరిగిపోయింది. ఆమె చేసిన పని చాలా సాధారణంగా కనిపించినా, దాని వెనుక ఉన్న ప్రేమ, పట్టుదల అందరినీ ఆకర్షించింది.
ఖమ్మం జిల్లా వైరా మండలం నారపనేనిపల్లి గ్రామానికి చెందిన తడికమల్ల విజయరాజు, విజయ దంపతులు సాధారణ కుటుంబం కాగా, విజయ మహిళా సమాఖ్య ద్వారా రూ.2 లక్షల రుణం తీసుకుని వైరా మున్సిపాలిటీ కార్యాలయం ఎదురుగా టీ స్టాల్ నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తోంది. భర్త విజయరాజు టీ స్టాల్ నుంచి ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేట్ ఆఫీసులకు నడుచుకుంటూ వెళ్లి టీ సరఫరా చేసేవాడు. సొంత వాహనం లేకపోవడంతో ఇద్దరూ రోజూ ఇబ్బందులు పడేవారు.

స్వగ్రామానికి వెళ్లాలంటే ఆటోలపై ఆధారపడాల్సి వచ్చేది. భర్త కష్టం చూసిన విజయ మనసులో ఒక నిర్ణయం తీసుకుంది. భర్తకు ఒక వాహనం కొనిపెడదాం" అని. అనుకున్నదే తడవుగా టీ స్టాల్‌లో రోజూ వచ్చిన చిల్లర నాణేలను ఒక డబ్బాలో దాచడం మొదలుపెట్టింది. ఒక్కో రూపాయి, ఒక్కో రెండు రూపాయల నాణేలు.. ఇలా రోజూ కొద్దిగా కూడబెట్టుకుంటూ ఏడాదిన్నర కాలం గడిచింది. చివరకు డబ్బా నిండి రూ.50 వేలు అయింది.
దసరా సమయంలో వైరాలోని వజ్ర టీవీఎస్ షోరూంలో రూ.10 వేల రాయితీ ప్రకటించారు. దీంతో విజయ, విజయరాజు ఇద్దరూ షోరూంకు వెళ్లారు. తాము ఏడాదిన్నరగా దాచిన చిల్లర నాణేల డబ్బాను తెరిచి చూపించి, ఈ డబ్బుతో మోపెడ్ ఇవ్వాలని కోరారు. షోరూం డెవలప్‌మెంట్ మేనేజర్ వెంకటేశ్వరరెడ్డి, బ్రాంచ్ మేనేజర్ అఖిల్ వారి కష్టాన్ని, ప్రేమను అర్థం చేసుకున్నారు. యాజమాన్యంతో మాట్లాడి అంగీకారం తీసుకుని, నాణేలను లెక్కించి మోపెడ్ అందించారు.
భార్య చేసిన ఈ ప్రేమపూర్వక బహుమతిని చూసి విజయరాజు కళ్లలో ఆనందం, కృతజ్ఞత కనిపించాయి. తన కష్టాన్ని గుర్తించి ఇంతకాలం నాణేలు దాచిన భార్య ప్రేమకు ఆయన మురిసిపోయాడు. షోరూం యాజమాన్యానికి కూడా ధన్యవాదాలు చెప్పారు.రోజూ టీ స్టాల్‌లో వచ్చిన చిల్లర నాణేలను ఒక్కొక్కటిగా దాచి, ఏడాదిన్నర కాలంలో రూ.50 వేలు కూడబెట్టి భర్తకు టీవీఎస్ మోపెడ్ బహుమతిగా ఇచ్చిన భార్య కథ కేవలం ఒక వాహనం కొన్న కథ కాదు.
చిన్న చిన్న మొత్తాలను కూడా పొదుపు చేస్తే పెద్ద లక్ష్యాలు సాధించవచ్చని చెప్పే గొప్ప కథ. భార్యాభర్తల మధ్య ఉండాల్సిన అవగాహన, ప్రేమ, అనురాగానికి ఇది అద్భుత ఉదాహరణగా నిలిచే కథ..













Click it and Unblock the Notifications
