మా బ్రదర్ ఓడితే రాజీనామా చేస్తా: కోమటిరెడ్డి, వైఎస్‌పై జైపాల్ రెడ్డి పరోక్ష విమర్శ
నల్గొండ/ హైదరాబాద్: ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన సోదరుడు, తమ పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఓడిపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెప్పారు. సోమవారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడారు. రాజగోపాల్‌రెడ్డి ఓడిపోతే ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఆయన తెలిపారు.
ఏనాడూ జై తెలంగాణ అనని వ్యక్తికి టీఆర్‌ఎస్ టికెట్ ఇచ్చారని మండిపడ్డారు. టీఆర్‌ఎస్ డబ్బు, రాజకీయ పలుకుబడితో గెలవాలని చూస్తోందని ఆయన విమర్శించారు. తెలంగాణ కోసం కొట్లాడిన కోమటిరెడ్డి బ్రదర్స్‌పై కేసీఆర్ కత్తిగట్టారని ఆరోపించారు. ప్రతిపక్షాలను నిర్వీర్యం చేస్తూ పవిత్ర యాగం చేస్తోన్న కేసీఆర్‌కు యాగఫలం దక్కదని, పాపమే దక్కుతుందని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

ఇదిలావుంటే, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కొందరు పి. జనార్దన్ రెడ్డి (పిజెఆర్)ను మనస్తాపానికి గురి చేశారని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి వైయస్ రాజశేఖర రెడ్డిపై పరోక్ష విమర్శ చేశారు. పీజేఆర్ గొప్ప ప్రజానాయకుడని అన్నారు. హైదరాబాద్‌లో ఇప్పటివరకు ఇంతటి ప్రజానాయకుడు లేడని అన్నారు. పీజేఆర్‌ది ఎవరితో రాజీపడే మనస్తత్వం కాదని జైపాల్‌రెడ్డి చెప్పారు.
పీజేఆర్ పేదలకు ఎనలేని సేవలు చేశారని తెలంగాణ పిసిసి చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. హైదరాబాదులోని నెక్లస్ రోడ్డు పీపుల్స్ ప్లాజాలో పీజేఆర్ వర్ధంతి సభ సోమవారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 26 మంది ఎమ్మెల్యేలతో సీఎల్పీ లీడర్‌గా కాంగ్రెస్‌ను నిలబెట్టారని గుర్తు చేశారు. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు వల్ల తెలంగాణకు అన్యాయం జరుగుతుందని పోరాటం చేశారని ఆయన తెలిపారు.
పీజేఆర్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేసినా వేరే పార్టీలోకి వెళ్లలేదని కాంగ్రెస్ నేత విష్ణు అన్నారు. పార్టీ మారాలని కుటుంబ సభ్యులం కోరినా ఒప్పుకోలేదని తెలిపారు. పీజేఆర్ ఆశయాలతో కాంగ్రెస్ బలోపేతం కోసం పనిచేస్తానని విష్ణు అన్నారు. ఈ కార్యక్రమంలో పొన్నాల లక్ష్మయ్య, వి. హనుమంతారవు, అంజన్ కుమార్ యాదవ్, రాపోలు ఆనందభాస్కర్ తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications