శరీరంలో రూ.కోటి విలువైన డ్రగ్స్: ఎయిర్‌పోర్టులో పట్టుబడ్డ విదేశీ మహిళ
హైదరాబాద్: కడుపులో మాదకద్రవ్యాల సీసాలు దాచుకున్న ఓ మహిళను శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఆదివారం అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దక్షిణ అమెరికాకు చెందిన మూసా (33) అనే మహిళ దాదాపు రూ.కోటి విలువైన డ్రగ్స్ నింపిన రెండు సీసాలను తన శరీర అంతర్భాగాల్లో పెట్టుకుని హైదరాబాద్ వచ్చింది.
కాగా, అధికారుల తనిఖీల్లో ఆమె దొరికిపోయింది. నార్కోటిక్స్ బ్యూరో అధికారులు ఆమెకు స్కానింగ్ నిర్వహించగా, సీసాల గుట్టు రట్టయింది. అయితే, ఇలా సీసాలు పెట్టుకుని రావడం ఆమె ప్రాణాలకే ముప్పుగా పరిణమించింది.
ఓ సీసాను బయటికి తీసిన అధికారులు, మరో సీసాను బయటికి తీసేందుకు విఫలయత్నం చేశారు. దీంతో, శస్త్రచికిత్స నిమిత్తం ఆమెను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు ఎలినొస్కోపి పద్ధతిలో మూసా కడుపులోంచి 20 చిన్న చిన్న సీసాలను బయటకు తీశారు.

ఈ సీసాల్లో 500 గ్రాములకు పైగా బ్రౌన్ షుగర్ ఉన్నట్లుగా కస్టమ్స్ అధికారులు చెప్పారు. దీని విలువ బహిరంగ మార్కెట్‌లో సుమారు కోటి రూపాయల వరకు ఉండవచ్చని భావిస్తున్నారు. మొసా కోలుకున్నాక విచారణ జరుపుతామని కస్టమ్స్ అధికారులు చెప్పారు.
ఇప్పటిదాకా, బంగారం పట్టివేతలకు బాగా ప్రసిద్ధికెక్కిన శంషాబాద్ ఎయిర్ పోర్టులో డ్రగ్స్ పట్టుబడడం చర్చనీయాంశం అయింది.












Click it and Unblock the Notifications