నిర్మానుష్య ప్రాంతంలో ట్రావెల్ బ్యాగ్.. ఓపెన్ చేస్తే !
హైదరాబాద్ బాచుపల్లిలో ఒక ట్రావెల్ బ్యాగ్‌లో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమవడం కలకలం రేపుతోంది. బాచుపల్లిలోని రెడ్డీస్ ల్యాబ్ ప్రహరీ గోడకు ఆనుకుని ఉన్న ఖాళీ స్థలంలో ఓ బ్యాగ్ ను స్థానికులు గుర్తించారు. బ్యాగ్ నుంచి దుర్వాసన రావడంతో వెంటనే అనుమానంతో పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ట్రావెల్ బ్యాగ్‌ను తెరిచి పరిశీలించగా అందులో కుళ్లిపోయిన స్థితిలో ఓ మహిళ డెడ్‌బాడీ కనిపించింది.
కాగా మృతురాలి వయసు సుమారు 25 నుంచి 35 ఏళ్ల మధ్య ఉంటుందని.. ఆమె మెరూన్ కలర్ చుడిదార్ ధరించి ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. ఈ హత్య మూడు నుంచి నాలుగు రోజుల క్రితమే జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు. మహిళను చంపిన తర్వాత ఓ పథకం ప్రకారంగా నిర్మానుష్య ప్రాంతంలో బ్యాగులో పెట్టి వదిలినట్లు అనుమానిస్తున్నారు.

ఇక విజయదుర్గ ఓనర్స్ అసోసియేషన్ కాలనీ సమీపంలో ఈ దారుణం చోటుచేసుకుంది. బాలానగర్ జోన్ డీసీపీ సురేష్ కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందాలు ఏర్పాటయ్యాయి. సీసీ కెమెరాల ఫుటేజ్‌ను ఆధారంగా తీసుకుని, సంఘటన జరిగిన ప్రాంతంలో అనుమానాస్పదంగా తిరిగిన ఇద్దరు వ్యక్తులపై విచారణ కొనసాగుతోంది. మృతురాలి వివరాలు పూర్తిగా తెలియాల్సి ఉందని.. ఒకసారి ఆమె ఎవరో గుర్తిస్తే, నిందితుల జాడ బయటపడే అవకాశం ఉందని పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం ఘటనపై కేసు నమోదు చేసి, మృతురాలి గుర్తింపు, హత్యకు కారణాలపై విచారణను వేగవంతం చేశామని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications