తెలంగాణ మహిళలకు శుభవార్త.. వాళ్లకు ప్రతీనెల లక్షలు సంపాదించే ఛాన్స్!
తెలంగాణ ప్రభుత్వం మహిళల ఆర్థిక స్వావలంబన మరియు సాధికారతను మరింత బలోపేతం చేసే దిశగా ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని శాసనసభ నియోజకవర్గాల్లో మహిళా స్వయం సహాయక సంఘాలు నడిపే పెట్రోల్ బంకులను ఏర్పాటు చేయాలని సర్కారు ఆదేశాలు జారీ చేసింది. ఈ కార్యక్రమం ఇందిరా మహిళా శక్తి పథకం కింద అమలు చేయనుంది.
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పెట్రోల్ బంకులు
ప్రస్తుతం నారాయణపేట, సంగారెడ్డి జిల్లాల్లో ప్రయోగాత్మకంగా మహిళలు నడుపుతున్న పెట్రోల్ బంకులు విజయవంతంగా నడుస్తున్నాయి. ఈ విజయం నుంచి ప్రేరణ పొంది, మిగిలిన జిల్లాల్లో మరిన్ని బంకులు స్థాపించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రాజెక్ట్ కింద మొదటిదశలో 39ప్రాంతాల్లో కొత్త పెట్రోల్ బంకులు నిర్మించే పనులు వేగంగా సాగుతున్నాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం వంటి ప్రముఖ చమురు కంపెనీలతో సహకారంతో ఈ పనులు జరుగుతున్నాయి.

ఇప్పటికే మొదలైన నిర్మాణ పనులు
సెర్ప్ సంస్థ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అమలు అవుతోంది. భూమి గుర్తింపు, లీజు ఒప్పందాలు, అనుమతులు, అండర్ గ్రౌండ్ ట్యాంకుల ఏర్పాటు, లేఅవుట్ రూపకల్పన వంటి అన్ని ప్రక్రియలు వివిధ దశల్లో ఉన్నాయి. ఆదిలాబాద్, వికారాబాద్, వనపర్తి, ఖమ్మం, కుమురంభీం, హనుమకొండ వంటి జిల్లాల్లో భూమి చదును చేయడం, ప్రాథమిక నిర్మాణ పనులు ఇప్పటికే మొదలయ్యాయి.
పెట్రోల్ బంకులు మహిళా సంఘాలకు స్థిరమైన ఆదాయ వనరు
కరీంనగర్ జిల్లాలో రెండు సంఘాలకు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లు లభించాయి. కామారెడ్డి, సూర్యాపేట, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో లీజు, అనుమతుల ప్రక్రియలు దాదాపు పూర్తి దశకు చేరుకున్నాయి. జాతీయ రహదారుల సంస్థ, ఫైర్ సర్వీసెస్, పోలీసు, మున్సిపల్, రెవెన్యూ శాఖల నుంచి NOCలు తీసుకునే పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి.ఈ పెట్రోల్ బంకులు మహిళా సంఘాలకు స్థిరమైన ఆదాయ వనరుగా మారనున్నాయి. ఒక్కో బంకు సంవత్సరానికి లక్షల రూపాయల లాభం అందించే అవకాశం ఉంది.
మహిళల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వ నిర్ణయం
ఇది మహిళలను ఆర్థికంగా బలపరచడంతో పాటు, వారి నైపుణ్యాలు, నాయకత్వ లక్షణాలను పెంపొందించడంలో కూడా సహాయపడుతుంది. ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా విస్తరించి, మహిళల సమగ్ర అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుంది. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలని నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా అన్ని రంగాల్లో మహిళలకు అవకాశం ఇస్తుంది.













Click it and Unblock the Notifications