విద్యార్థుల కోసం యంగ్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ లు.. తల్లిదండ్రులకు శుభవార్త!
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రతీ ఒక్క విద్యార్థికి నాణ్యమైన విద్యను అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగా ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ప్రతీ నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటు చేస్తుంది. అంతేకాదు తెలంగాణా పబ్లిక్ స్కూల్స్ కూడా ఏర్పాటు చేసి సామాన్య, మధ్యతరగతి కుటుంబాల పిల్లలకు నాణ్యమైన ఇంగ్లీష్ మీడియం విద్యా బోధన చేస్తుంది.
యంగ్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ లుగా మోడల్ స్కూల్స్
ఈ క్రమంలో తాజాగా మరో ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది తెలంగాణా సర్కార్. మోడల్ స్కూళ్లను యంగ్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ లుగా మార్చే కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, గద్వాల, కొత్తగూడెం జిల్లాలు మినహా మిగిలిన 29 జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున 29 మోడల్ స్కూళ్లను ఈ విధంగా అభివృద్ధి చేయనున్నారు. పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదనకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆమోదం తెలిపారు.

జాతీయస్థాయి ప్రవేశ పరీక్షలకు నాణ్యమైన కోచింగ్
ఇంతకు ముందు 31 జిల్లాల్లోని 93 కేజీబీవీలను యంగ్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లుగా మార్చిన విషయం తెలిసిందే. అదే తరహాలో ఇప్పుడు మోడల్ స్కూళ్లను కూడా ఎంపిక చేశారు. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ అంటే ఇవి సాధారణ పాఠశాలలు కావు. గ్రామీణ, పేద, ప్రతిభావంతులైన విద్యార్థులకు జాతీయస్థాయి ప్రవేశ పరీక్షలకు నాణ్యమైన కోచింగ్ అందించే ప్రత్యేక కేంద్రాలు. జేఈఈ, ఈఏఎంసీఈటీ (అప్‌సెట్), నీట్, క్లాట్ వంటి పరీక్షలకు నిపుణులైన అధ్యాపకులతో శిక్షణ ఇస్తారు.
ఈ స్కూల్స్ ఏర్పాటు వెనుక కారణం ఇదే
ఫౌండేషన్ కోర్సులు, అడ్వాన్స్‌డ్ కోచింగ్, పోటీ వాతావరణం కల్పిస్తారు.ప్రభుత్వ పాఠశాలల్లోని ప్రతిభావంతులు ప్రైవేట్ కోచింగ్ కేంద్రాలకు వెళ్లకుండా, వారికి డబ్బులు ఖర్చు కాకుండా ఉచితంగా, అధిక నాణ్యతతో పరీక్షలకు సన్నద్ధం కావాలని లక్ష్యంగా వీటిని ఏర్పాటు చేస్తుంది. గ్రామీణ ప్రాంత విద్యార్థులు జాతీయ పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించేలా మద్దతు ఇవ్వడం, విద్యా నాణ్యత పెంచడం ఈ స్కూల్స్ ప్రధాన ఉద్దేశం.
నాణ్యమైన విద్య అందించాలన్న ప్రభుత్వ విజన్
ఈ ఏడాది నుంచే కోచింగ్ ప్రారంభమవుతుంది. వచ్చే సంవత్సరం నుంచి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామని పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు నవీన్ నికోలస్ తెలిపారు. ఈ నిర్ణయం విద్యారంగంలో సమాన అవకాశాలు, నాణ్యమైన విద్య అందించాలన్న ప్రభుత్వ విజన్‌లో భాగంగా చెప్పవచ్చు.












Click it and Unblock the Notifications